సామర్లకోట: చమురు ధరలు పెంపును నిరసిస్తూ సీపీఎం పెద్దాపురం కమిటీ ఆధ్వర్యాన ఆ పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఆదివారం ధర్నా నిర్వహించారు. డీజిల్ ధరల పెంపు ఆటో డ్రైవర్లకు భారంగా మారిందని పేర్కొంటూ, మెయిన్ రోడ్డులోని వినాయకుని గుడి నుంచి వేముల వారి సెంటర్ వరకూ ఆటోను వినూత్నంగా తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నీలపాల సూరిబాబు మాట్లాడుతూ, ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే అందరూ ఊహించినట్టుగానే మోదీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి, ప్రజలపై భారం మోపిందని అన్నారు. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గిన సమయంలో కూడా దేశంలో డీజిల్, పెట్రోలు ధరలను తగ్గించలేదని, సామాన్య ప్రజలపై భారాలు మోపుతూ, కార్పొరేట్ సంస్థలకు మోదీ వరాలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. కృష్ణా–గోదావరి బేసిన్‌లో దొరికే గ్యాస్‌ను రాష్ట్ర ప్రజలకు అందకుండా గుజరాత్, మహారాష్ట్రలకు పైపులైన్ల ద్వారా తరలించడం దారుణమని అన్నారు. పెంచిన డీజిల్, పెట్రోలు ధరలను వెంటనే తగ్గించాలని సూరిబాబు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు క్రాంతికుమార్, సిరిపురపు శ్రీనివాస్, వడ్డి సత్యనారాయణ, కూనిరెడ్డి అప్పన్న, గడిగట్ల సత్తిబాబు, కూనిరెడ్డి అరుణ తదితరులు పాల్గొన్నారు.


