టిప్పర్‌ ప్రమాదంలో 5కు చేరిన మరణాలు | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ప్రమాదంలో 5కు చేరిన మరణాలు

May 18 2026 12:18 AM | Updated on May 18 2026 12:18 AM

జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మహిళ మృతి

కాకినాడ రూరల్‌: కొవ్వూరు వంతెన వద్ద శనివారం జరిగిన టిప్పర్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. చీడిగ గ్రామానికి చెందిన ఉపాధి హామీ మహిళా కూలీలు శనివారం ఉదయం పనికి వెళ్లి, కాకినాడ బైపాస్‌ రోడ్డుపై కొవ్వూరు వంతెన వద్ద ఆన్‌లైన్‌లో మస్టర్లు వేస్తుండగా.. అత్యంత వేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టి నలుగురు మృతి చెందిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో గాయపడిన మట్టపర్తి అరుణ కుమారి (52) కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఆమె భర్త గోవిందు గతంలో మృతి చెందాడు. ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లయ్యాయి. వారి వద్దనే అరుణ కుమారి ఉంటుంది. ఇటీవలే గుండె సంబంధిత వైద్యం చేయించుకున్న ఆమె.. కుటుంబ పోషణ కోసం ఉపాధి పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో ప్రమాదం జరిగి, మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అరుణ కుమారి మృతదేహానికి జీజీహెచ్‌ వద్ద ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు.

ఈ ప్రమాదంలో గాయపడిన మరో మహిళా కూలీ పాలిక నాగమణి అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురి కుటుంబాలకు వైఎస్సార్‌ సీపీ అండగా నిలిచింది. ప్రమాదం జరిగిన వెంటనే మాజీ మంత్రి, ఆ పార్టీ కాకినాడ రూరల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు జీజీహెచ్‌లో మృతుల కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ జిల్లా కార్యదర్శి, చీడిగ గ్రామ నాయకుడు కొప్పిశెట్టి గణేష్‌ ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున మొత్తం ఐదుగురికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకూ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement