ఆ గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆ గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలి

May 16 2026 12:27 AM | Updated on May 16 2026 12:27 AM

కాకినాడ రూరల్‌: నగర పాలక సంస్థలో పరిసరాల్లోని పలు గ్రామాలను విలీనం చేయాలని మాజీ మంత్రి, కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు డిమాండ్‌ చేశారు. ఇందుకు తమ పార్టీ తరఫున ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. కాకినాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పరిసర గ్రామాలను కలపాలనే డిమాండ్‌ ప్రజల్లో ఉందన్నారు. తాను 2009–14 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొన్ని గ్రామాలను విలీనం చేశామన్నారు. తరువాత కోర్టు కేసులు, ఇతర కారణాలతో ఆ గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా మార్చారన్నారు. అలా మార్చిన వాటిలో తూరంగి, రమణయ్యపేట వంటి అతి పెద్ద గ్రామాలు ఉన్నాయని చెప్పారు. కాకినాడ కార్పొరేషన్‌ను ఆనుకుని ఉన్న ఈ రెండింటిని చిన్న మున్సిపాలిటీలుగా చెప్పవచ్చని, వీటితో పాటు వాకలపూడి, వలసపాకల, చీడిగ, ఇంద్రపాలెం గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయాల్సిన పరిస్థితులున్నాయని అన్నారు. ఆయా గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారని, వందలాదిగా కొత్త కాలనీలు అభివృద్ధి చెందడంతో పంచాయతీల పరిధి విస్తరించిందని చెప్పారు. సర్పవరం, తిమ్మాపురం వరకూ నగరం విస్తరించిందన్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ నగరంలో అంతర్భాగంగా మారిపోయిన ఉన్న రమణయ్యపేట, ఇంద్రపాలెం, తూరంగి, చీడిగ, వాకలపూడి, వలసపాకల వంటి గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలని కన్నబాబు కోరారు. తూరంగి, రమణయ్యపేట వంటి గ్రామాలు బాగా విస్తరించి ఉండటం, ఆదాయం తక్కువగా వస్తూండటంతో మౌలిక సదుపాయాల కల్పన కష్టంగా మారిందన్నారు. అందువలన వీటిని కార్పొరేషన్‌లో విలీనం చేయాలని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకినాడకు బెస్ట్‌ లివింగ్‌ సిటీగా దేశంలో అవార్డులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రత్యేకతను నిలబెట్టేలా ప్రజలు అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో నగరాన్ని విస్తరించాలని కన్నబాబు కోరారు.

ఫ మాజీ మంత్రి

కురసాల కన్నబాబు డిమాండ్‌

ఫ పూర్తి సహకారం అందిస్తామని వెల్లడి

Advertisement
 
Advertisement
Advertisement