వేలాదిగా.. పాండవుల మెట్టకు..
పెద్దాపురం (సామర్లకోట): రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దాపురం పాండవుల మెట్టపై ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయానికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శ్రీ పద్మినీ, ఛాయా, ఉషా, ప్రజ్ఞా దేవీ సమేత సూర్యనారాయణమూర్తి కల్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించారు. మెట్టపై పాల పొంగళ్లు నిర్వహించి, ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణస్వామికి నివేదించారు. ఇక్కడ రథసప్తమి నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ వివిధ గ్రహ దేవతల కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. సోమవారం చంద్రుడు, 27న అంగారకుడు, 28న బుధుడు, 29న బృహస్పతి (గురుడు), 30న శుక్రుడు, 31న శనీశ్వరుడు, రాహు, కేతు గ్రహ దేవతలకు కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. చివరి రోజున మహాన్నదానం జరుగుతుందని ఆలయ పాలక మండలి సభ్యుడు రవికిషోర్ తెలిపారు.


