సా...గుతున్న వరి నాట్లు | - | Sakshi
Sakshi News home page

సా...గుతున్న వరి నాట్లు

Jan 25 2026 7:21 AM | Updated on Jan 25 2026 7:21 AM

సా...

సా...గుతున్న వరి నాట్లు

రబీ చివర్లో అవస్థలు తప్పవా?

ప్రస్తుత సుమారు నెల రోజులు పైబడే రబీ వరినాట్లు ఆలస్యం కావడంతో ఏప్రిల్‌ నెలాఖరు వరకు పంట కోతలకు వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మార్చి నెలాఖరున కాలువలు మూసివేస్తే శివారు ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి ఉండదు. ఏప్రిల్‌ నెలలో ఎండలు విపరీతంగా కాస్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నీరు విడుదల చేసినా శివారు ఆయకట్టుకు నీరు వెళ్లడం కష్టమే అంటున్నారు రైతులు. గత ఏడాది రబీ సీజన్లో కూడా రైతులు మార్చి నెలాఖరులోనే సాగునీరు లేక అనేక అవస్థలు పడ్డారు. ప్రస్తుతం రబీ సాగు మరింత ఆలస్యం కావడంతో ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని ఇప్పటి నుంచే రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఏడాది మూడో పంట లేనట్టే..

ప్రభుత్వ నిర్వాకంతో అన్నదాతకు

తప్పని అవస్థలు

ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు

ఆలస్యంతోనే రబీ ఆలస్యం

ప్రారంభంలోనే ఎరువుల కొరత

ఈ ఏడాది సాగు లక్ష్యం 1.70 లక్షల

ఎకరాలు

ఇప్పటి వరకూ 1.50 లక్షల ఎకరాల్లో నాట్లు

ఇంకా ఆలస్యమైతే చివరి దశలో

ఆయకట్టుకు నీరందడం కష్టమే

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ప్రభుత్వ నిర్వాకంతో ఈ ఏడాది రబీలో రైతులు వరి నాట్లు వేయడం చాలా ఆలస్యం అయిపోయింది. జనవరి నెల ముగుస్తున్నా ఇంకా నాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాది 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1.50 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయి. ఇంకా సుమారు 20వేల ఎకరాల్లో వరి నాట్లు వేయాల్సి ఉంది. రైతులు సాధారణంగా రబీలో వెదజల్లు సాగుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ ఏడాది 70 శాతం మేర వెదజల్లు సాగు చేపట్టారు. అయినప్పటికీ ఇప్పటికే నెలరోజులు ఆలస్యమైనా ఇంకా పూర్తి స్థాయిలో ఆయకట్టులో వరినాట్లు పూర్తికాలేదు. ఖరీఫ్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సరైన ఏర్పాటు చేయలేదు. దీంతో రోజుల తరబడి కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోతోంది. తేమ శాతం బూచిగా చూపి సుమారు 20 రోజుల పైబడే కళ్లాలోనే ధాన్యం ఆరబోయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ధాన్యం అమ్ముకోవడానికే సమయం సరిపోవడంతో రబీ ఏర్పాట్లు చేసుకోలేదు. అందుకే ఈ ఏడాది రబీ సాగు నెల రోజులు పైబడే ఆలస్యం అయిపోయింది. సాధారణంగా డిసెంబర్‌ నెలాఖరులోగా రబీ వరి నాట్లు పూర్తి చేసేవారు. మార్చి మొదటి లేదా రెండవ వారంలో కోతలు పూర్తయ్యేవి. మూడో పంట అపరాల సాగు చేపట్టేవారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేది. ఒక ఎకరంలో అపరాలు సాగు చేస్తే రెండు నుంచి మూడు బస్తాలు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం క్వింటాల్‌ అపరాలు రూ. పదివేలు తక్కువ కాకుండా రేటు పలుకుతోంది. దీంతో ఎకరా రైతుకు సుమారు రూ.30 వేలు పైబడి ఆదాయం వచ్చేది. పెట్టుబడి పోను సుమారు రూ.20 వేల వరకు మిగిలేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. రబీ సాగే ఏప్రిల్‌ నెలాఖరు వరకూ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఎరువుల కొరత

ప్రభుత్వం నారుమడుల కోసం కాంప్లెక్స్‌ ఎరువులు, యూరియా అందుబాటులో ఉంచకపోవడంతో వరి నాట్లు వేసేందుకు రైతులు సంకోచించారు. కొంతమంది రైతులు సంప్రదాయ పద్ధతిలో నారు పోసుకుని, వరి నాట్లు వేసుకున్నారు. అయితే వారికి ఎరువులు దొరకకపోవడంతో రబీ సాగు ఆలస్యంగా చేపట్టారు. ప్రభుత్వం గత ఖరీఫ్‌లో ఎరువులు సక్రమంగా అందించలేని దుస్థితి నేపథ్యంలో ప్రస్తుత రబీలోనూ అదే పరిస్థితి ఎదురవుతుందని రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. రైతులకు కావలసినన్ని ఎరువులు కూడా ఈ ప్రభుత్వం అందించలేని పరిస్థితులు నెలకొంటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధాన్యం కొనుగోలు చేయలేదు

ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ఆసక్తి చూపకపోవడంతో బయట వ్యక్తులకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వరి కోత యంత్రాలతో కోతలు కోయడం వల్ల తేమ శాతం ఎక్కువగా ఉందని రైస్‌ మిల్లర్లు ధాన్యం తీసుకోలేదు. ఆరబోసి తేవాలని చెప్పారు. సుమారు 20 రోజులు ధాన్యం ఆరబోసినా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో బయట వ్యక్తులకు విక్రయించాను. పండించిన ధాన్యం అమ్ముకోవడానికి చాలా రోజులు పట్టడంతో రబీ పనులు ఆలస్యం అయ్యాయి.

కర్నీడి వీర్రాజు, రైతు, తిమ్మాపురం,

కాకినాడ రూరల్‌ మండలం

కౌలు రైతులకు తప్పని ఇబ్బందులు

గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లో కౌలు రైతులకు కావలసిన అన్ని ఎరువులు ఇవ్వడం లేదు. ఎరువులు కావాల్సిన రైతులు ఆధార్‌ కార్డు, భూములకు సంబంధించిన పాస్‌ పుస్తకాలు తేవాలని రైతు సేవా కేంద్రం సిబ్బంది సూచిస్తున్నారు. కౌలు రైతులకు పాస్‌పుస్తకాలు లేకపోవడంతో వారికి ఎరువులు ఇచ్చేందుకు అక్కడ సిబ్బంది ససేమిరా అంటున్నారు. దీంతో కౌలు రైతులు దూరప్రాంతాలకు వెళ్లి ఎక్కువ రేట్లకు ఎరువులు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

కొన్ని గ్రామాల్లో కూటమి నాయకులు వారికి కావాల్సిన వారికి మాత్రమే కూపన్లు ఇచ్చి రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు సరఫరా చేస్తున్నారు. దీంతో సాధారణ రైతులతోపాటు, కౌలు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామాల్లో కూటమి నాయకులు తమకు కావాల్సిన వారికి మాత్రమే ఎరువులు సరఫరా చేస్తున్నారని ఇటీవల జరిగిన జిల్లాపరిషత్‌ సమావేశంలో సైతం జేడ్పీటీసీ సభ్యులు వ్యవసాయశాఖ అధికారులను నిలదీశారు.

సా...గుతున్న వరి నాట్లు 1
1/1

సా...గుతున్న వరి నాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement