తండోపదండాలు !
● సత్యదేవుని దర్శించిన 25 వేల మంది
● 1,500 వ్రతాల నిర్వహణ
● దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం
● ఘనంగా సత్యదేవుని ప్రాకార సేవ
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి శనివారం భారీగా భక్తులు తరలివచ్చారు. సుమారు 25 వేల మంది భక్తులు దేవస్థానానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంత మండపాలు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామి వారి వ్రతాలాచరించి దర్శనం చేసుకున్నారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారి వ్రతాలు 1,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదువేల మంది సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భోజనం చేశారు.
తిరుచ్చి వాహనంపై ఊరేగింపు
శనివారం ఆలయ ప్రాకారంలో తిరుచ్చి వాహనం మీద స్వామి, అమ్మవార్లను ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనం మీద ప్రతిష్ఠించి ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు అర్చకుడు గంగాధరబట్ల శ్రీనివాస్ పూజలు చేసిన అనంతరం అర్చక స్వాములు కొబ్బరికాయ కొట్టి ప్రాకారసేవ ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛాటన మధ్య, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో సేవ నిర్వహించారు. సేవ అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
నేడు రథసప్తమి వేడుకలు
రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి 11 గంటల వరకు రత్నగిరిపై వార్షిక కల్యాణ మండపంలో రుత్విక్కులు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గోవు పిడకలపై పాయసం వండి సూర్యభగవానుడికి నివేదిస్తారు. అనంతరం భక్తులకు పాయసం ప్రసాదంగా నివేదిస్తారని అధికారులు తెలిపారు.


