నిర్లక్ష్యం వల్లే ఎలుకల పరుగులు
● సత్యదేవుని ప్రసాదాల కౌంటర్లను
పట్టించుకోని వైనం
● అధికారులది చాలాకాలంగా ఇదే తీరు
● ఎట్టకేలకు ఆర్డీవో పరిశీలన
అన్నవరం: సత్యదేవుని ప్రసాదం విక్రయించే కౌంటర్లలో కొంతకాలంగా ఎటువంటి తనిఖీలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసతులు ఎలా ఉన్నాయి...ప్రసాదాలు నిల్వ చేయడానికి సరైన ఏర్పాట్లు ఉన్నాయా లేదా అనే విషయమై దృష్టి పెట్టాల్సిన అధికారులు కొంతకాలంగా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అందుకే జాతీయ రహదారిపై సత్యదేవుని పాత నమూనా ఆలయం వద్ద గోధుమ నూక ప్రసాదం ప్యాకెట్ల మీద ఎలుకలు పరుగులు తీస్తూ ప్రసాదాన్ని తింటున్న వీడియో భక్తులు బయట పెట్టే వరకు అధికారులు గమనించలేకపోయారు.
సిబ్బంది నియామకంలో కూడా శ్రద్ధ కరవు
ప్రసాదం కౌంటర్లలో సిబ్బంది పలుమార్లు వివాదాలకు కారణమవుతున్నారు. గత ఏడాది సత్యదేవుని తొలిపాంచా వద్ద గల కౌంటర్, కొత్త నమూనా ఆలయం వద్ద గల కౌంటర్‌లో మద్యం సేవించి భక్తులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశారు. తాజాగా పాత నమూనా ఆలయం కౌంటర్ వద్ద ప్రసాదాలపై ఎలుకలు పరుగుల వీడియో కారణంగా ఇద్దరు సస్పెండ్ అయ్యారు. ఇంజినీరింగ్ సిబ్బంది తరచూ ప్రసాదం కౌంటర్లలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయోనని తనిఖీలు చేయాలి. ప్రసాదం కౌంటర్లలో గల సమస్యలను ఎప్పటికప్పుడు అక్కడ సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకురావాలి. కానీ రెండూ జరగడం లేదు. ఇకపై అయినా తనిఖీలు జరిగితే ఇటువంటివి పునరావృతం కావు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రసాదం కౌంటర్లు తనిఖీ చేసిన
ఆర్డీఓ రమణి
ప్రసాదం కౌంటర్‌లో ఎలుకల విహారం వీడియో వైరల్ అవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కౌంటర్లను తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి శనివారం సాయంత్రం రత్నగిరి మీద గల రెండు కౌంటర్లు, తొలిపావంచా, పాత, కొత్త నమూనా ఆలయాల వద్ద గల కౌంటర్లను తనిఖీ చేశారు. ప్రసాదం నిల్వ ఉంచే ప్లాస్టిక్ బుట్టలపై మూతలు ఉంచాలని ఆదేశించారు. ఆమె వెంట దేవస్థానం డీసీ బాబూరావు, ఈఈ రామకృష్ణ, ప్రసాదం విభాగం సూపరింటెండెంట్ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, విశ్రాంతి ఆర్‌ఐ భాస్కర ప్రసాద్ ఉన్నారు.


