పరిశుభ్రత సామాజిక బాధ్యత
కాకినాడ రూరల్: పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యత అని, స్వచ్ఛ కాకినాడ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఇన్‌చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ రూ రల్ మండలం ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్లాస్టిక్, ఇనుము, ఇతర వస్తువులకు బదులుగా నిత్యావసర సరకులు అందించే స్వచ్ఛ రథాన్ని ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు తదితరులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ రూరల్ ఎంపీడీవో కార్యాలయం పక్కన నివాసం ఉంటున్న ఎం.రామకృష్ణ దంపతులు స్వచ్ఛ రథానికి ఇనుము, ఇతర వస్తువులు అందించగా వాటికి బదులుగా రూ.34 విలువైన సబ్బులు, టీ పొడి ప్యాకెట్లు కలెక్టర్ వారికి అందజేశారు. ఆయన మాట్లాడుతూ ‘జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర‘ నినాదంతో ఈ కార్యక్రమాన్ని జిల్లా అంతటా ఈ నెలలో నిర్వహిస్తున్నామన్నారు. జెడ్పీ సీఈవో లక్ష్మణరావు మాట్లాడుతూ శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 24 స్వచ్ఛ రథాలను ప్రారంభించామన్నారు. వీటిలో 17 రకాల నిత్యావసర సరకులు అందుబాటులో ఉంటాయని, ప్రజలు తమ వద్ద నిరుపయోగంగా ఉన్న ఇ వేస్ట్, ప్లాస్టిక్ తదితర వస్తువులకు బదులుగా ఈ నిత్యావసర వస్తువులను తీసుకోవచ్చని తెలిపారు. కాకినాడ రూరల్ ఎంపీడీవో పి.సతీష్, డిప్యూటీ ఎంపీడీవో ఎం.శ్రీరామ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఎండీ అబ్దుల్ మతిన్, డీఈ డీ. శ్రీనివాసరావు, సీడీపీఓ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు పాల్గొన్నారు.
ఆక్రమణదారులకు నోటీసులు
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): పంచాయతీ, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ పరిధిలోని కాలువలు, చెరువులు, డ్రైనన్ల పై ఉన్న ఆక్రమణలను గుర్తించి, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం వాచ్ డాగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో సమావేశం నిర్వహించి, గుర్తించిన ఆక్రమణలను తొలగించేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ఇందుకు పంచాయితీ, ఇరిగేషన్, సర్వే శాఖల అధికారులు సమష్టిగా పని చేయాలని సూచించారు. డీఆర్వో జె.వెంకటరావు, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు ఎస్.మల్లి బాబు, కె.శ్రీరమణి, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, డ్రైన్‌న్ల ఈఈ ఎంవీవీ కిషోర్ పాల్గొన్నారు.


