లెక్క తేల్చి.. కొలిక్కి తెచ్చి | - | Sakshi
Sakshi News home page

లెక్క తేల్చి.. కొలిక్కి తెచ్చి

Jan 23 2026 6:51 AM | Updated on Jan 23 2026 6:51 AM

లెక్క తేల్చి.. కొలిక్కి తెచ్చి

లెక్క తేల్చి.. కొలిక్కి తెచ్చి

నూరు శాతం సొమ్ము రికవరీ

రూ.58.39 లక్షలు దారి

మళ్లించిన పురోహితుడు

ఇటీవలే రూ.50.57 లక్షల వసూలు

తాజాగా రూ.4.82 లక్షలు

చెల్లించిన ఆ పురోహితుని భార్య

మిగిలిన రూ.3 లక్షలు భర్త గ్రాట్యుటీ

నుంచి జమ చేయాలని ఈఓకు వినతి

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఓ వ్రత పురోహితుడు చేతివాటం చూపి కాజేసిన రూ.58.39 లక్షలను అధికారులు ఎట్టకేలకు పూర్తిగా రికవరీ చేశారు. ఈ చేతివాటం వ్యవహారం గత డిసెంబర్‌లో వెలుగు చూసింది. అప్పట్లోనే ఆ పురోహితుడు రూ.28.54 లక్షలు జమ చేశాడు. ఆ తరువాత అతడు హఠాత్తుగా మృతి చెందాడు. అయితే, ‘చేతివాటం’పై పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు ఆదేశించారు. ఈ మేరకు చేపట్టిన తనిఖీల్లో ఆ పురోహితుడు మరో 12 మంది పురోహితులకు రూ.22 లక్షలు పంపించినట్లు గుర్తించిన అధికారులు వారందరికీ గత సోమవారం నోటీసులిచ్చారు. వారందరూ ఆ మొత్తాన్ని మంగళవారం జమ చేశారు. దీంతోపాటు ఈపీఎఫ్‌కు చెల్లించాల్సిన రూ.8.82 లక్షలను ఆ పురోహితుడు ఇద్దరికి పంపించినట్లు అధికారులు గుర్తించి, వారికి కూడా నోటీసులిచ్చారు. దీంతో, వారు కూడా ఆ మొత్తాన్ని చెల్లించారు. ఆ పురోహితుడి నుంచి రూ.1.42 లక్షలు అందుకున్న సోలార్‌ కాంట్రాక్టర్‌కు నోటీస్‌ ఇవ్వడంతో అతడు కూడా ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఆ పురోహితుని భార్య ఖాతాకు జమ చేసిన రూ.2,26 లక్షలు, అతడి అత్త అకౌంట్‌కు జమ చేసిన రూ.10,600 కూడా దేవస్థానానికి జమ చేశారు. తద్వారా గత మంగళవారం నాటికి మొత్తం రూ.50.57 లక్షలు రికవరీ చేయగలిగారు.

గ్రాట్యుటీ నుంచి రికవరీకి చర్యలు

చేతివాటం చూపిన పురోహితుడు తనకు వాస్తవంగా రావాల్సిన పారితోషికం కన్నా అదనంగా రూ.7.82 లక్షలు తన అకౌంట్‌కు జమ చేసుకున్నట్లు అధికారుల తనిఖీలో వెల్లడైంది. అతడు మృతి చెందడంతో ఆ మొత్తం తిరిగి చెల్లించాలని అతడి భార్య, కుటుంబ సభ్యులకు మంగళవారం నోటీసు ఇచ్చారు. ఈ మేరకు ఆ పురోహితుడి భార్య గురువారం రూ.4.82 లక్షలు చెల్లించారు. తన భర్తకు రావల్సిన గ్రాట్యుటీ మొత్తం నుంచి మిగిలిన రూ.3 లక్షలు జమ చేసుకోవాలని దేవస్థానం ఈఓ వి.త్రినాథరావుకు ఆమె వినతిపత్రం సమర్పించారు. దీంతో, ఆ మొత్తాన్ని జమ చేస్తూ ఫైలు పెట్టాలని సంబంధిత అధికారులను ఈఓ ఆదేశించారు. ఆ మేరకు అధికారులు ఈఓకు ఫైలు పంపించారు. పురోహితుడు కాజేసిన మొత్తం నూరు శాతం రికవరీ అవడంతో దేవస్థానం అధికారులు, వ్రత పురోహితులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక దశలో ఆ పురోహితుడు రూ.కోట్లు స్వాహా చేశాడని, అందులో చాలా మంది పాత్ర ఉందనే ప్రచారం జరిగింది. ఒకరైతే రూ.3 కోట్లు స్వాహా చేశారని, ఇందులో 20 మంది పురోహితుల పాత్ర ఉందని ఆరోపిస్తూ ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశిస్తూ లేఖ రూపంలో మరో పురోహితుడి పేరిట ఫిర్యాదు కూడా చేశారు. అయితే, తాను ఎలాంటి ఫిర్యాదూ చేయలేదని, దానిపై ఉన్న సంతకం, ఫోన్‌ నంబర్‌ తనవి కావని ఆ పురోహితుడు వివరణ ఇవ్వడంతో అది ఫేక్‌ లేఖగా తేలింది. మృతి చెందిన పురోహితుడి కుటుంబ సభ్యులతోను, అదనంగా పారితోషికం జమ అయిన పురోహితులతోను వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు చామర్తి కన్నబాబు, మాజీ అధ్యక్షుడు నాగాభట్ల రవిశర్మ, కర్రి సూర్యనారాయణ (నాని) చర్చించి, ఆ మొత్తం తిరిగి జమ చేసేలా ఒప్పించారు.

నేడు కమిషనర్‌కు నివేదిక

పురోహితుడు కాజేసిన రూ.58.39 లక్షలూ రికవరీ చేసినట్టు దేవస్థానం ఈఓ త్రినాథరావు దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌కు శుక్రవారం నివేదిక పంపనున్నట్లు అధికారులు తెలిపారు. పురోహితుడి చేతివాటం వ్యవహారం 2024 జనవరి నుంచి గత ఏడాది నవంబర్‌ వరకూ దాదాపు రెండేళ్ల పాటు కొనసాగింది. అయినప్పటికీ అటు దేవస్థానం, ఇటు ఆడిట్‌ అధికారులు ఈ విషయాన్ని పసిగట్టలేకపోవడంపై కమిషనర్‌ ఏవిధంగా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement