త్వరితగతిన జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు | - | Sakshi
Sakshi News home page

త్వరితగతిన జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు

Jan 23 2026 6:51 AM | Updated on Jan 23 2026 6:51 AM

త్వరి

త్వరితగతిన జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌ కింద చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ అపూర్వ భరత్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా వాటర్‌, శానిటేషన్‌ మిషన్‌ కమిటీ సభ్యులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద జిల్లాలో రూ.498.59 కోట్లతో 1,007 పనులు చేపట్టగా, ఇంతవరకు 581 పనులు పూర్తయ్యాన్నారు. పురోగతిలో ఉన్న మిగిలిన 426 పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 20 మండలాల్లోని 667 నివాస ప్రాంతాల్లో 2,02,084 ఇళ్లు ఉండగా ఇంతవరకూ 1,12,858 కుళాయి కనెక్షన్లు ఇచ్చారని, మిగిలినవి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. జల్‌ జీవన్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా పూర్తి చేయాలన్నారు. తాను కూడా త్వరలో క్షేత్ర స్థాయిలో పర్యటించి, పూర్తి చేసిన, పురోగతిలో ఉన్న పనులను పరిశీలిస్తానని చెప్పారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వాటర్‌ గ్రిడ్‌ కింద రూ.1,650 కోట్ల నాబార్డ్‌ నిధులతో చేపడుతున్న తాగునీటి సరఫరా ప్రాజెక్ట్‌ పనులపై అధికారులతో సమీక్షించారు. వివిధ ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చేపట్టిన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ నిర్మాణ పనుల్లో పురోగతి కనబరచాలని అధికారులకు అపూర్వ భరత్‌ సూచించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఎండీ అబ్దుల్‌ మతీన్‌, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, ఇరిగేషన్‌ ఈఈ శేషగిరిరావు, డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

వ్రత పురోహితులకు

ఎట్టకేలకు పారితోషికం

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో పని చేస్తున్న సుమారు 250 మంది వ్రత పురోహితులకు గత నెల పారితోషికం (జీతాలు) రూ.92 లక్షలను ఎట్టకేలకు గురువారం వారి ఖాతాల్లో జమ చేశారు. అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితుల పారితోషికాల బిల్లు తయారు చేసే ఓ పురోహితుడు చేతివాటం చూపి, రూ.58.39 లక్షలు కాజేసిన విషయం దేవస్థానం అధికారుల తనిఖీలో వెలుగు చూసిన విషయం విదితమే. ఆ మొత్తాన్ని ఆ పురోహితుడు, అతడి కుటుంబ సభ్యులు, ఈ అవకతవకల్లో భాగస్వాములైన ఇతర పురోహితులు దేవస్థానానికి తిరిగి జమ చేశారు. ఈ నేపథ్యంలో వ్రత పురోహితులకు గత నెల పారితోషికం చెల్లింపులో జాప్యం జరిగింది. సంబంధిత బిల్లును దేవస్థానం, ఆడిట్‌ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో ఈ నెల 19వ తేదీ వచ్చినా వారికి పారితోషికం జమ కాలేదు. దీనికి తోడు పాలకొల్లులో జరిగిన సామూహిక వ్రతాల్లో భక్తుల నుంచి బలవంతంగా కానుకలు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంలో కూడా పురోహితులపై అధికారులు ఆంక్షలు విధించారు. దీంతో, అటు పారితోషికం అందక, ఇటు కానుకలకు బ్రేక్‌ పడటంతో వ్రత పురోహితుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీనిపై ఈ నెల 20న ‘సాక్షి’ ‘ఆకలి కేకలు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై దేవస్థానం అధికారులు స్పందించి, విషయాన్ని ఆడిట్‌ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో వారు ఆ బిల్లును పరిశీలించి, ఆమోద ముద్ర వేశారు. అనంతరం, ఆ బిల్లును ఈఓ వి.త్రినాథరావు బుధవారం పరిశీలించి, చెక్కుపై సంతకం చేశారు. ఆ చెక్కును, పురోహితుల పారితోషికం జాబితాను స్టేట్‌ బ్యాంక్‌కు గురువారం పంపించారు. వాటిని పరిశీలించిన అనంతరం పురోహితులకు పారితోషికాలు జమ చేసినట్లు బ్యాంక్‌ మేనేజర్‌ భరద్వాజ్‌ ‘సాక్షి’కి తెలిపారు.

దేవస్థానాల్లో కొత్త హుండీలు

అన్నవరం: సత్యదేవుని సన్నిధి సహా రాష్ట్రంలోని అన్ని దేవస్థానాల్లో భక్తుల క్యూలలో స్టెయిన్‌లెస్‌ స్టీలు హుండీలు ఏర్పాటు చేయాలని దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ గురువారం ఆదేశించారు. ప్రస్తుతం ఆలయాల్లో ఉన్న హుండీల ఎత్తు ఎక్కువగా ఉన్నందున వాటిలో కానుకలు సమర్పించడానికి భక్తులు ఇబ్బంది పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనివలన క్యూలో భక్తులు వేగంగా కదలక దర్శనం ఆలశ్యమవుతోందన్నారు. అందువలన దేవస్థానాల్లో చక్రాలతో కలిపి మూడడుగుల ఎత్తు, 16 అంగుళాల వెడల్పు, అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి అవసరమైనంత పొడవుతో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ హుండీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్కో హుండీ బరువు 55 నుంచి 60 కేజీల మధ్యలో ఉండేలా.. రెండంగుళాల మందంతో బాక్స్‌ తరహాలో హుండీలు తయారు చేయించాలని ఆదేశించారు. క్యూలు సరిగ్గా లేనిచోట 2.9 అడుగుల నుంచి మూడడుగుల వెడల్పున స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ క్యూలు కూడా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ హుండీలు, క్యూల తయారీకి నిబంధనల ప్రకారం ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ పద్ధతిలో టెండర్లు పిలవాలని ఆదేశించారు.

త్వరితగతిన జల్‌ జీవన్‌  మిషన్‌ పనులు 1
1/2

త్వరితగతిన జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు

త్వరితగతిన జల్‌ జీవన్‌  మిషన్‌ పనులు 2
2/2

త్వరితగతిన జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement