కాకినాడకు మరింత పేరు తేవాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించిన ఆర్టీసీ డ్రైవర్ మందపల్లి శ్రీనివాసరావు కాకినాడకు మరింత పేరు తీసుకు రావాలని జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) ఎం.శ్రీనివాసరావు ఆకాంక్షించారు. పతకాలు సాధించిన శ్రీనివాసరావును ఆర్డీసీ డిపోలో గురువారం అభినందించారు. ఈ నెల 17, 18న హర్యానాలో జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 3 బంగారు పతకాలే కాకుండా ఇప్పటి వరకూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో 97 పతకాలు సాధించడం గొప్ప విషయమన్నారు. పతకాలు సాధించిన శ్రీనివాసరావును అసిస్టెంట్ మేనేజర్ మాలిమ్ బాషా, పీఆర్‌ఓ వెంకటరాజు అభినందించారు.
నేడు శ్రీపంచమి పూజలు
సామర్లకోట: వసంత పంచమి(శ్రీపంచమి)ని పురస్కరించుకొని స్థానిక పంచారామ క్షేత్రంలోని సరస్వతీ దేవి ఆలయం వద్ద శుక్రవారం విద్యార్థులతో సరస్వతీ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉదయం 8.30 గంటలకు విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి, అమ్మవారికి పంచామృతాభిషేకాలు, సరస్వతీ హోమం, అనంతరం విద్యార్థులతో పూజా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. విద్యార్థినీ విద్యార్థులు సరస్వతీ పూజలో పాల్గొని అమ్మవారి కటాక్షం పొందాలని కోరారు. విద్యార్థులకు యార్లగడ్డ వెంకట సుబ్బారావు పేరిట ఆయన కుమారులు పుస్తకాలు, మాజీ ఎంపీపీ కొండపల్లి కృష్ణమూర్తి పెన్నులు, కటకం సృజన్ బిస్కెట్లు, అమ్మవారి ఫొటో, పలువురు దాతలు అమ్మవారి రూపులు, పువ్వులు ఇవ్వడానికి ముందుకొచ్చారని అర్చకుడు సన్నిధిరాజు వెంకన్న తెలిపారు. మిగిలిన ఏర్పాట్లను దేవస్థానం చేస్తుంది.
కలెక్టర్‌కు ఎన్నికల సంఘం అవార్డు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల నమోదులో ఉత్తమ విధానాలతో ప్రతిభ చూపిన జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వివేక్ యాదవ్ గురువారం అవార్డు ప్రకటించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవంలో కలెక్టర్ ఈ అవార్డు అందుకోనున్నారు. 2025 సంవత్సరానికి గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.
ఈవీఎంల భద్రతకు చర్యలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఈవీఎంలు, వీవీ ప్యాట్ల భద్రతకు తగు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, ఎన్నికల శాఖల అధికారులను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎంల గోదామును గురువారం ఆయన తనిఖీ చేశారు. అక్కడ చేపడుతున్న భద్రతా చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదాము పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈవీఎంల గోదామును తనిఖీ చేసి, నివేదిక పంపిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి.జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.


