నిందితులను నడిపిస్తూ కోర్టుకు తీసుకువెళ్లిన పోలీసులు
● కుట్ర పూరితంగానే హత్య
● డీఎస్పీ శ్రీహరిరాజు
తుని రూరల్: కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితులను తుని రూరల్ సర్కిల్ పోలీసులు నడిరోడ్డుపై నడిపించి కోర్టుకు తీసుకువెళ్లారు. నిందితులను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తీసుకువెళ్లడం సరికాదని ఉన్నత న్యాయస్థానాలు పేర్కొన్నా ప్రజలు చూస్తుండగా అటువంటి ఘటన తునిలో పునరావృతమైంది.
ఈ నెల 16న జరిగిన ఘటనకు సంబంధించి తుని రూరల్ సర్కిల్ కార్యాలయంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ వైరం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న శత్రుత్వం కారణంగా హత్య జరిగిందన్నారు. అల్లిపూడి గ్రామంలో రెండు రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య చిన్న విషయాలకే తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు. 2019 నుంచి ఒక వర్గం కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం, బెదిరించడం, దాడులు చేయడం వంటి ఘటనలు జరిగాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారన్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తీవ్ర శత్రుత్వం ఏర్పడిందన్నారు. ఈ నెల 16న అదే గ్రామానికి చెందిన అంకంరెడ్డి ఎర్రపాత్రుడు పుట్టినరోజు సందర్భంగా ఒక వర్గం కార్యకర్తలు గ్రామంలో ఊరేగింపు నిర్వహించి, రామాలయం వద్ద జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమానికి వెళుతూ రాత్రి 8.30 గంటల సమయంలో చింతకాయల చినబాబు (విశ్వనాథ్) ఇంటి వద్దకు చేరుకున్నారన్నారు. అప్పటికే నిందితులందరూ కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో కాపుకాసి ఉన్నారన్నారు. చింతకాయల నారాయణ మహేష్ (యేసుబాబు) మోటార్ సైకిల్‌పై వెళుతున్న చిటికెల శ్రీరామ్‌ను లాగి కింద పడేసి దాడి చేయగా ఇతర నిందితులు కర్రలు, రాడ్లతో అతనిని విచక్షణారహితంగా కొట్టారన్నారు. చిటికెల నారాయణమూర్తి కత్తితో శ్రీరామ్‌ను ముఖంపై తీవ్రంగా గాయపర్చారన్నారు. అనంతరం చింతకాయల చినబాబు (విశ్వనాథ్), చింతకాయల నారాయణ మహేష్ కలసి లాలం బంగారయ్యను కత్తితో పొడిచారన్నారు. తీవ్ర రక్తస్రావమై బంగారయ్య కుప్పకూలిపోయాడన్నారు. మిగిలిన నిందితులు రుత్తల దుర్గాప్రసాద్ తదితరులపై కర్రలు, ఇనుప రాడ్‌లతో దాడిచేసి చంపేస్తామంటూ బెదిరిస్తూ అక్కడ నుంచి పరారయ్యారన్నారు. క్షతగాత్రులను కోటనందూరు పీహెచ్‌సీకి అక్కడ నుంచి తుని ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు డీఎస్పీ వివరించారు. చికిత్స పొందుతూ లాలం బంగారయ్య (38) మరణించినట్టు తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. హత మార్చాలనే ఉద్దేశంతో కుట్ర పన్నినట్టు సాక్షుల వాంగ్మూలంతో స్పష్టమైందన్నారు. విశ్వసనీయ సమాచారంతో కోటనందూరు మండలం కేఏ మల్లవరం వద్ద 12 మంది నిందితులను మధ్యవర్తుల సమక్షంలో అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం తుని కోర్టులో హాజరుపర్చుతున్నట్టు డీఎస్పీ తెలిపారు. మీడియా సమావేశంలో రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు, రూరల్, కోటనందూరు ఎస్సైలు కృష్ణమాచారి, టి.రామకృష్ణ పాల్గొన్నారు. మీడియా సమావేశం అనంతరం రూరల్ సీఐ కార్యాలయం నుంచి పార్కు సెంటర్ మీదుగా కోర్టు వరకు సుమారు కిలోమీటరు మేర నిందితులను నడిపించి తీసుకెళ్లారు.
అరెస్టయిన నిందితులు
చింతకాయల సన్యాసిరాజా విశ్వనాథ్, చింతకాయల నారాయణ మహేష్, చిటికెల నారాయణమూర్తి, పెదపాత్రుని సతీష్, గొంప వీరబాబు, అంకంరెడ్డి సాయికుమార్, చింతకాయల సత్యనారాయణమూర్తి, రుత్తల సాయి భానుప్రకాష్, కాళ్ల రమేష్, రుత్తల కిషోర్, రుత్తల సాయి కిరణ్, అంకంరెడ్డి నారాయణమూర్తి ఉన్నారు.


