ఆవు అడ్డొచ్చి వరుసగా బస్సులు ఢీ
రాజమహేంద్రవరం రూరల్: దివాన్‌చెరువు వద్ద మంగళవారం అర్ధరాత్రి ఆవు అడ్డు రావడంతో ఒకదానికి ఒకటి మూడు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు బస్సులలో విహారయాత్రకు వెళ్లి తిరుగు పయనమైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన పాఠశాల విద్యార్థులతో కలిపి 40 మందికి గాయాలయ్యాయి. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రాధమిక చికిత్స అనంతరం వారు స్వగ్రామాలకు బయలుదేరి వెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా దిండి గ్రామానికి చెందిన పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, కళాశాలకు చెందిన 9, 10, ఇంటర్ చదువుతున్న 56 మంది బాలికలు, 53 మంది బాలురు, పది మంది ఉపాధ్యాయులు రెండు బస్సులలో ఈ నెల 17వ తేదీన విహారయాత్రకు బయలుదేరారు. అరకు, విశాఖబీచ్ తదితర ప్రాంతాలను సందర్శించి మంగళవారం అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో బాలురతో ఉన్న బస్సు దివాన్‌చెరువుకు వచ్చేసరికి ఆవు అడ్డురావడంతో సడన్‌బ్రేక్ వేశారు. దీంతో ఆ వెనుకనే విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సు దానిని కొట్టింది. ఈ బస్సు వెనుకే బాలికలతో వస్తున్న బస్సు ఢీ కొట్టింది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రిన్సిపాల్‌తో పాటు 37 మంది విద్యార్థినులకు గాయాలు కాగా, బాలుర బస్సు నడుపుతున్న డ్రైవర్‌తో పాటు ఒక విద్యార్థికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హోంగార్డ్స్ డీఎస్పీ కిరణ్‌కుమార్, సీఐలు మంగాదేవి, సుమంత్, సిబ్బంది చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం గాయపడిన వారిని మూడు 108 అంబులెన్స్‌లలో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన విద్యార్థులను దివాన్‌చెరువులోని బాలవికాస్ మందిరానికి తరలించారు. గాయపడిన విద్యార్థులకు ప్రాధమిక చికిత్స అనంతరం డిశ్చార్జి చేసి పంపించారు. సంఘటన స్థలాన్ని తూర్పు మండల డీఎస్పీ బి.విద్య, బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌కుమార్, ఎస్సై మురళీమోహన్ పరిశీలించారు. మూడు బస్సులను ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా పక్కన పెట్టించారు. ఆవు అడ్డురావడంతో సడన్‌బ్రేకు వేయగా వెనుక నుంచి బస్సు ఢీకొనడంతో తనకు, ఒక విద్యార్థికి గాయాలయ్యాయని బస్సు డ్రైవర్ ఎండి షకీర్ ఫిర్యాదు చేశాడు. ముందు బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో తమ బస్సు ఢీకొందనని, వెనుక మరో బస్సు ఢీకొందని, దీంతో ఆ బస్సులో ఉన్న కొందరు బస్సు అద్దాలు పగులగొట్టడంతో అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు బస్సుడ్రైవర్ అంబరీష్ మరో ఫిర్యాదు చేశారు. తమ బస్సు డ్రైవర్ నిబంధనలు పాటించకుండా 50 మీటర్లు డిస్టెన్స్ పాటించకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే బాలికలు గాయపడ్డారని స్కూలు ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. మూడు ఫిర్యాదుల మేరకు ఎస్సై మురళీమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దివాన్‌చెరువులో అర్ధరాత్రి
రోడ్డు ప్రమాదం
రెండు బస్సులలో ప్రయాణిస్తున్న 40 మంది తెలంగాణ విద్యార్థులకు గాయాలు
మూడు ఫిర్యాదులపై కేసులు నమోదు
ఆవు అడ్డొచ్చి వరుసగా బస్సులు ఢీ


