మహిళ మెడలో పుస్తెల తాడు అపహరణ
గ్యాస్ స్టౌ మరమ్మతు కోసమని వచ్చి చోరీ
కరప: ఇంట్లోని మగవారు బయటకు వెళ్లడాన్ని గమనించిన ఒక దొంగ గ్యాస్ స్టవ్ రిపేర్ కోసమని ఇంట్లోకి వెళ్లి మంచంపై ఉన్న ఒక మహిళ మెడలోని 8 కాసుల పుస్తెలతాడు, నల్లపూసల గొలుసు లాక్కొని పరారైన ఘటన కరపలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ఉప్పలపాటి వెంకటస్వామి, అతని కుమారుడు శ్రీనుతో కలసి కాకినాడకు ఆసుపత్రి పనిమీద వెళ్లారు. ఇదిగమనించిన దొంగలు వారింటికి వెళ్లి ఒకరు బయట ఉండి కాపలా కాయగా మరొకడు ఇంట్లోకి చొరబడ్డాడు. అనారోగ్యంతో మంచంపై పడుకుని ఉన్న వెంకటస్వామి భార్య సత్యవతి అతనిని గమనించి ఎవరని ప్రశ్నించగా వెంకటస్వామిగారు గ్యాస్‌స్టవ్ రిపేర్ చేయమని పంపారని చెప్పి కొంత సేపు అక్కడ తచ్చాడి అంతలోనే ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడు, నల్లపూసల గొలుసు లాక్కొని పరారయ్యాడు. కాకినాడ నుంచి వచ్చిన తండ్రీ, కొడుకులకు సత్యవతి జరిగిన విషయం తెలిపింది. దీంతో బాధితులు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదుచేశారు. ఎస్‌ఐ టి.సునీత సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి జరిగిన దొంగతనం వివరాలు అడిగి తెలుసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పేలిన ఆర్టీసీ బస్సు టైరు
● మహిళకు తీవ్ర గాయాలు
● ఇద్దరికి స్వల్పగాయాలు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరం వై జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు టైరు ఒక్కసారిగా పేలడంతో బస్సులోని ఓ ప్రయాణికురాలికి తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయలయ్యాయి. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బుధవారం ఉదయం కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వచ్చింది. స్థానిక వైజంక్షన్‌కు వచ్చేసరికి బస్సు వెనుక టైరు పేలింది. దీంతో టైరు పైభాగంలో కూర్చున్న పెద్దిళ్లపేటకు చెందిన మంగాలక్ష్మికి ఐరన్‌రేకు పైకిలేచి ఆమె కాళ్ల వేళ్లకు తగలడంతో పాటు అద్దం చేతిని తీవ్రంగా గాయపరిచింది. అలాగే బస్సు సూపర్‌వైజర్ విజయలక్ష్మి, ఆనూరు గ్రామానికి వరలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగాలక్ష్మిని అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో
మహిళ మృతి
సామర్లకోట: స్థానిక పెద్దాపురం ఏడీబీ రోడ్డులో అపర్ణ టైల్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఒక మహిళ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఎస్సై వి.మౌనిక కథనం ప్రకారం సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామానికి చెందిన పోతురాజు సుమలత (50) అపర్ణ ప్యాక్టరీలో పని చేస్తూ బుధవారం విధులు ముగించుకుని బంధువు మోటారు సైకిల్‌పై వెళుతున్న సమయంలో జారి కింద పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమెను ఢీకొని ఆమె పై నుంచి వెళ్లిపోవడంతో శరీరం నుజ్జు నుజ్జు అయింది. లారీ ఆగకుండా వెళ్లి పోవడంతో ఆ ప్రాంత ప్రజలు లారీ నెంబరును గుర్తించి పోలీసులకు తెలిపారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైవే మోబైల్ కానిస్టేబుల్ ఈ ప్రమాదాన్ని గుర్తించి పెద్దాపురం ఎస్సైకు సమాచారం ఇచ్చారు.
భార్యను గాయపరచిన
కేసులో జైలు
ప్రత్తిపాడు: భార్యపై దాడిచేసి గాయపరిచిన భర్తకు ప్రత్తిపాడు జ్యుడీషీయల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎల్ గోపీనాథ్ ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారు. సీఐ బి సూర్య అప్పారావు తెలిపిన వివరాల మేరకు మండలంలోని రాచపల్లిలో 2016 మే 22న కోన సూర్యారావు (సూరిబాబు) మద్యం తాగి, తన భార్య రమణమ్మపై కర్రతో దాడి చేశాడు. దీంతో ఆమె తల, నడుముపై తీవ్ర గాయాలయ్యాయి. రమణమ్మ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై ఎం.నాగదుర్గారావు కేసు నమోదు చేసి, చార్జిషీటు దాఖలు చేశారు. ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, ఏపీపీలు పి.రవీంద్ర మోహన్, కేఎస్‌ఎస్ లక్ష్మీదేవి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. నేరారోపణ రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చినట్టు ప్రత్తిసాడు సీఐ తెలిపారు.


