సెంట్రింగ్ కూలి ఒకరి మృతి
ముగ్గురికి గాయాలు
ధవళేశ్వరం: పంప్ హౌస్ రెండో స్లాబ్ వేస్తుండగా సెంట్రింగ్ కూలడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. ఇందులో ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ధవళేశ్వరం సాయిబాబా గుడి పక్కన మురుగునీరు గోదావరిలోకి పంపు చేసేందుకు పంపు హౌస్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటికే మొదటి శ్లాబ్ పూర్తయ్యింది. రెండో శ్లాబ్‌కు బుధవారం మధ్యాహ్నం కాంక్రీట్ వేస్తుండగా అది కూలిపోయింది. దీంతో ధవళేశ్వరం సుబ్బాయమ్మపేటకు చెందిన సెంట్రింగ్ మేస్త్రి కేతమళ్ల వెంకటేష్ (50)కు తీవ్ర గాయాలయ్యాయి. వెంకటేష్‌ను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వం అసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో ముగ్గురు కూలీలు గాయపడ్డారు. వీరిలో సుబ్బాయమ్మపేటకు చెందిన దొడ్డి బాలకిశోర్, వడ్డెర కాలనీకి చెందిన రామాటి రాజు, వల్లెపు సింహాద్రి ఉన్నారు. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని తొలుత రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సీఐ టి.గణేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన సమయంలో సెంట్రింగ్ కింద తక్కువ మంది కూలీలు ఉండడంతో పెనుప్రమాదం తప్పింది.
సుబ్బాయమ్మపేటలో విషాదఛాయలు
సంఘటన జరిగిన సమీపంలో మృతుడు కేతమళ్ల వెంకటేష్ నివాసం ఉంటున్నాడు. పనికి వెళ్లిన అతడు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన దొడ్డి బాలకిశోర్ కూడా ఇదే ప్రాంతంలో నివసిస్తున్నాడు.
సెంట్రింగ్ కూలి ఒకరి మృతి
సెంట్రింగ్ కూలి ఒకరి మృతి
సెంట్రింగ్ కూలి ఒకరి మృతి


