85 శాతం రికవరీ
అన్నవరం: సత్యదేవుని వ్రత విభాగంలో ఓ పురోహితుడు చేతివాటం చూపి రూ.58.39 లక్షలు స్వాహా చేసిన వ్యవహారంలో అధికారులు తాజాగా మరో రూ.22 లక్షలు రికవరీ చేశారు. ఈ వ్యవహారం గత డిసెంబర్‌లో వెలుగు చూడగా నిలదీయడంతో అప్పట్లోనే ఆ పురోహితుడు రూ.28.54 లక్షలు చెల్లించాడు. అనంతరం, అతడు హఠాత్తుగా మృతి చెందాడు. ఆ పురోహితుడు 2024 జనవరి నుంచి గత ఏడాది నవంబర్ వరకూ వ్రత పురోహితుల పారితోషికం బిల్లును అధికారుల కన్నుగప్పి.. అధిక మొత్తానికి పెంచేవాడు. అలా పెంచిన మొత్తాన్ని తన, కుటుంబ సభ్యుల, ఇతర పురోహితుల అకౌంట్లకు జమ చేసి, కాజేసిన విషయం అధికారుల తనిఖీల్లో వెల్లడైన విషయం తెలిసిందే. అలా 12 మంది పురోహితులకు అదనంగా రూ.22 లక్షలు జమ అయినట్లు గుర్తించిన దేవస్థానం అధికారులు.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటూ వారికి సోమవారం నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా పురోహితులు తమ ఖాతాల్లో జమ అయిన అదనపు మొత్తాలను మంగళవారం తిరిగి చెల్లించారు. ఈపీఎఫ్‌కు చెల్లించాల్సిన మొత్తం రూ.8.82 లక్షలను ఆ పురోహితుడు ఇద్దరికి పంపించినట్లు గుర్తించిన అధికారులు వారికి కూడా నోటీసులిచ్చారు. దీంతో, వారు కూడా ఆ మొత్తాన్ని చెల్లించారు. ఈ క్రమంలోనే నోటీసు అందుకున్న సోలార్ కాంట్రాక్టర్ కూడా రూ.1.42 లక్షలు చెల్లించాడు. పురోహితుని భార్య అకౌంట్‌కు జమ చేసిన రూ.2.23 లక్షలు, అతడి అత్త అకౌంట్‌కు జమ చేసిన రూ.10,600 కూడా దేవస్థానానికి జమ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈవిధంగా ఇప్పటి వరకూ రూ.50.54 లక్షలు రికవరీ చేయగలిగారు.
మిగిలిన సొమ్ము వసూలుకు
ముమ్మర యత్నాలు
చేతివాటం ప్రదర్శించిన పురోహితుడు తనకు వాస్తవంగా రావాల్సిన పారితోషికం కన్నా అదనంగా రూ.7.85 లక్షలు తన అకౌంట్‌కు జమ చేసుకున్నట్లు తాజా తనిఖీలో వెల్లడైంది. ఇప్పుడు ఆ మొత్తం మాత్రమే రికవరీ కావాల్సి ఉంది. ఆ పురోహితుడు మృతి చెందడంతో ఆ మొత్తం తిరిగి చెల్లించాలంటూ అతడి భార్య, ఇతర కుటుంబ సభ్యులకు దేవస్థానం అధికారులు నోటీసు ఇచ్చారు. మృతి చెందిన పురోహితుడికి రూ.3.5 లక్షల వరకూ గ్రాట్యుటీ వచ్చే అవకాశం ఉంది. ఆ మొత్తం రికవరీ చేసుకోవాల్సిందిగా దేవస్థానానికి లేఖ ఇవ్వనున్నట్లు సమాచారం. మిగిలిన మొత్తం చెల్లించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఆ పురోహితుడు దారి మళ్లించిన రూ.58.39 లక్షల్లో దాదాపుగా 85 శాతం రికవరీ చేశామని, మిగిలిన మొత్తాన్ని కూడా రెండు రోజుల్లో తిరిగి రాబడతామని అధికారులు తెలిపారు. వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు కన్నబాబు, మాజీ అధ్యక్షుడు నాగాభట్ల రవిశర్మ, కర్రి సూర్యనారాయణ తదితరులు ఆ పురోహితులతో మాట్లాడి ఈ చెల్లింపులు చేయించినట్టు అధికారులు తెలిపారు.
ఫ ‘చేతివాటం’ సొమ్ము
రూ.58.39 లక్షలు
ఫ సూత్రధారి చెల్లించిన
మొత్తం రూ.28.54 లక్షలు
ఫ తాజాగా రూ.22 లక్షలు
తిరిగి చెల్లించిన పురోహితులు
ఫ రికవరీ కావాల్సినది
రూ.7.85 లక్షలు


