సంఘాల విచ్ఛినాన్ని ప్రోత్సహించరాదు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సంఘాల విచ్ఛినాన్ని ఏపీ ఎన్‌జీఓ సంఘం ప్రోత్సహించరాదని ఏపీ జేఏసీ–అమరావతి జిల్లా చైర్మన్ పితాని త్రినాథరావు, ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంసాని శ్రీనివాసరావు హితవు పలికారు. ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం పెద్దదని, దీని పటిష్టతకు తమ జేఏసీ కృషి చేస్తుందని చెప్పారు. ఆడిట్ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. డ్రైవర్ల సంఘం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎన్నికై ందని తెలిపారు. అయితే, కాకినాడలో డ్రైవర్ల సంఘం నూతన కార్యవర్గాన్ని దొడ్డిదారిన ప్రకటించారని, ఇది సరికాదని అన్నారు. సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో సంఘం సీనియర్ ఉపాధ్యక్షుడు జి.అబ్దుల్ హమీద్ సర్దార్, ఏపీ జేఏసీ–అమరావతి ప్రధాన కార్యదర్శి ఎన్‌వీఎస్‌ఎస్‌ఆర్‌కే దుర్గాప్రసాద్, ఏపీ గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రవి, ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.పద్మనాభం, ఏపీ జేఏసీ–అమరావతి జిల్లా కోశాధికారి సీవీవీ సత్యనారాయణ, డ్రైవర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి గణపతి, ఏపీ గవర్నమెంట్ డ్రైవర్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


