ఎటు చూసినా ఇసుకే.. | - | Sakshi
Sakshi News home page

ఎటు చూసినా ఇసుకే..

Jan 20 2026 7:38 AM | Updated on Jan 20 2026 7:38 AM

ఎటు చ

ఎటు చూసినా ఇసుకే..

రోడ్లపై ఇసుక తొలగించాలి

రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఇసుక చెల్లాచెదురుగా పడి ఉంటుంది. దీంతో ద్విచక్ర, త్రిచక్ర వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీలు అధిక ఇసుకలోడుతో వెళ్లడంతో పాటు, షడన్‌ బ్రేక్‌ వేసిన సమయంలో ఇసుక రోడ్డుపై పడుతుంది. దీంతో రోడ్డుపై పడిన ఇసుక వాహనాల రాపిడికి ఎగిరి వాహనదారుల కళ్లల్లోనూ, రోడ్ల పక్కకు చేరి ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్ల పక్కన గుట్టల మాదిరిగా పేరుకుపోతోంది. రోడ్లపై పడిన ఇసుకను అధికారులు తొలగించేలా చూడాలి.

– కంఠమణి రమేష్‌ బాబు, వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, కొవ్వూరు

నిర్వాహకులదే బాధ్యత

రోడ్లపై పడిన ఇసుక తొలగించే బాధ్యత సంబంధిత నిర్వాహకులదే. స్టాక్‌ పాయింట్లు పెట్టిన వారిని ఇసుక తొలగించాలని గతంలో ఆదేశాలు కూడా ఇచ్చాం. ర్యాంపుల నుంచి ఇసుకతో వెళ్లే లారీలు టార్పాలిన్లు తప్పనిసరిగా కప్పాలి. అదే విధంగా ఇసుక రోడ్లపై పడకుండా చర్యలు తీసుకోవాలి. అధిక లోడుతో వెళితే రూ.25 వేలు వరకు ఫైన్‌ వేయడం జరుగుతుంది. ఇసుక లారీలు నడిపే వారు, ర్యాంపు నిర్వాహకులు ఇసుక రోడ్లపై పడకుండా చర్యలు తీసుకోవాలి. లేకుంటే చర్యలు తప్పవు. వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా చూడాలి.

– రాణి సుస్మిత, ఆర్డీవో, కొవ్వూరు

ప్రయాణమంటేనే హడల్‌

అధికలోడు కారణంగా రోడ్లపై

జారిపడుతున్న ఇసుక

యథేచ్ఛగా ఇసుక లారీల రాకపోకలు

ప్రమాదాలతో భయపడుతున్న ప్రజలు

అధికారుల తీరుపై విమర్శలు

తాళ్లపూడి: కూటమి ప్రభుత్వంలో ఇసుక ర్యాంపుల్లో ఓ పక్క అక్రమ ఇసుక తవ్వకాలతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. అక్రమ ఇసుక తవ్వకాలతో పాటు, ఇసుక లారీలతో ట్రాఫిక్‌ సమస్య, మరోపక్క రోడ్లపై ఎక్కడపడితే అక్కడ జారిపడిన ఇసుకతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుక ర్యాంపుల్లో ఉచిత ఇసుక మాటున అక్రమ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతుంది. ఇక్కడి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలకు పెద్ద ఎత్తున పెద్ద లారీల్లో నిత్యం ఇసుక తరలిస్తున్నారు. ఇసుక లారీల కారణంగా రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. పరిమితికి మించి అధిక ఇసుక లోడుతో వెళుతున్న లారీల నుంచి ఇసుక జారిపడుతుంది. ఏటిగట్టు రోడ్డు మలుపుల వద్ద, రోడ్ల పైనా, రోడ్ల పక్కనా ఎక్కడ చూసిన ఇసుక మేటల మాదిరిగా దర్శనమిస్తుంది. దీంతో రహదారిపై వెళ్లే వాహనదారులు జారిపడి ప్రమాదాల బారినపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై పరిమితికి మించి వేగంగా వెళ్లే ఇసుక లారీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొవ్వూరు నుంచి ప్రక్కిలంక వరకు గోదావరి ఏటిగట్టు రోడ్డు పై నుంచి నిత్యం అధిక సంఖ్యలో వెళుతున్న ఇసుక లారీలు, ట్రాక్టర్ల నుంచి కిందికి జారిపోయిన ఇసుక ఆర్‌అండ్‌బీ రోడ్డుపై పేరుకుపోయి స్పీడ్‌గా వెళ్లే వాహనాలు అదుపు తప్పుతున్న పరిస్థితి నెలకొంది. నిబంధనల మేరకు ఇసుక లోడ్‌తో వెళ్లే వాహనాలపై టార్పాలిన్‌ కప్పాలి. చాలాసార్లు ఏ విధమైన టార్పాలిన్‌ లేకుండా ఇసుక రవాణా జరుగుతోంది. అధిక లోడ్‌ కారణంగా కప్పినా కూడా లారీ బ్రేక్‌ వేస్తే ఇసుక జారిపడుతుంది.

నియోజకవర్గంలోని ర్యాంపులు

కొవ్వూరు మండలంలో కొవ్వూరు, ఆరికిరేవుల, గామన్‌ బ్రిడ్జి సమీపంలోని ఆరికిరేవుల1, 2, దొండకుంట, వాడపల్లి, రోడ్‌కం రైల్వే బ్రిడ్జి వద్ద, తాళ్లపూడి మండలంలో తాళ్లపూడి, ప్రక్కిలంక, వేగేశ్వరపురం, తాడిపూడిలో ర్యాంపులు నడుస్తున్నాయి.

వాహనదారుల అవస్థలు

కొవ్వూరు మండలంలోని ఇసుక ర్యాంపుల నుంచి, తాళ్లపూడి మండలంలోని ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక రవాణా చేసే సమయంలో ఏటిగట్టు రోడ్డుపై ఇసుక జారి పడడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొవ్వూరులోని గోదావరిమాత విగ్రహం వద్ద రోడ్డుపై అయితే ఇసుక మేటలా పేరుకుపోయింది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఆటో సైతం తిరగబడింది. అంతేకాకుండా కొవ్వూరు, ఆరికిరేవుల ర్యాంపు వద్ద ఏటిగట్టుపైనా, చిడిపి నుంచి తాళ్లపూడి టి–గట్టు మలుపు వద్ద, తాళ్లపూడి నుంచి ప్రక్కిలంక చింతచెట్టు వద్ద ఏటిగట్టుపై, ప్రక్కిలంక ఆంజనేయ స్వామి ఆలయం జంక్షన్‌లో ఇసుక పడి ఉంది. అంతే కాకుండా పలు చోట్ల ఇసుకపడి ఉంది. పరిమితికి మించి లోడు వేయడంతో రోడ్లన్నీ ఇసుక మేటలతో దర్శనమిస్తున్నాయి. వాహనాలు వెళ్లేటప్పుడు దుమ్ము కూడా లేచిపోతుంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచే ఎక్కువగా ఇసుక ఎగుమతి అవుతుంది. దీంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతుంది. పరిమితికి మించి లోడు వేసినా, రాత్రీపగలు తేడా లేకుండా ఇసుక అతి వేగంతో లారీలు నడుతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక లారీల కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై పడి ఉన్న ఇసుకను తొలగించే నాథుడే లేడు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక తొలగించే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఎటు చూసినా ఇసుకే..1
1/4

ఎటు చూసినా ఇసుకే..

ఎటు చూసినా ఇసుకే..2
2/4

ఎటు చూసినా ఇసుకే..

ఎటు చూసినా ఇసుకే..3
3/4

ఎటు చూసినా ఇసుకే..

ఎటు చూసినా ఇసుకే..4
4/4

ఎటు చూసినా ఇసుకే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement