చెట్టు నుంచి జారిపడి గీత కార్మికుడి మృతి
రాజవొమ్మంగి: మండలంలోని ముర్లవానిపాలెం గ్రామానికి చెందిన సోముల సోమరాజు (45) కల్లు గీత కార్మికుడు తాటి చెట్టు నుంచి జారిపడి తీవ్రగాయాలతో మరణించారు. సోమరాజు ఆదివారం సాయంకాలం రోజు మాదిరిగానే కల్లు సేకరించేందుకు చెట్టు ఎక్కాడు. పట్టుతప్పి కింద పడిపోయిన సోమరాజును గ్రామస్తులు వెంటనే అంబులెన్స్‌లో రాజవొమ్మంగి పీహెచ్‌సీకు తరలించారు. కాగా అప్పటికే సోమరాజు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం వున్నారు. ఆ నిరుపేద గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.
లారీ ఢీకొని ఫార్మా ఉద్యోగి మృతి
అన్నవరం: స్థానిక జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడలోని జగన్నాథపురానికి చెందిన గుడివాడ కిరణ్ (40) అనకాపల్లిలోని అగనంపూడి వద్ద ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడు సోమవారం సాయంత్రం కాకినాడ నుంచి అనకాపల్లి బైక్ మీద వెడుతుండగా అన్నవరం వచ్చే సరికి డిగ్రీ కళాశాల వద్ద వెనుక నుంచి లారీ బలంగా ఢీ కొట్టడంతో అతను రోడ్డు మీద పడి తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో ఢీకొని హోంగార్డు మృతి
రాజానగరం: మండలంలోని రామస్వామిపేట వద్ద ఏడీబీ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో హోంగార్డు మృతి చెందాడు. సోమవారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తొండంగి మండలం, శృంగవృక్షానికి చెందిన మనం వీరబాబు (47) రంగంపేట పోలీసుస్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అనపర్తి పోలీసు సర్కిల్ కార్యాలయానికి తపాల్స్ తీసుకువెళ్లి సుమారు 12.30 గంటల సమయంలో తిరిగి వస్తుండగా రామస్వామిపేట వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆటో ఢీ కొనడంతో ప్రమాదానికి గురయ్యాడు. తలకు రోడ్డు మార్జిన్ తగిలి బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు మృతుని భార్య రామలక్ష్మీదేవి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పొదల్లో నవజాత శిశువు
చింతూరు: మండలంలోని కల్లేరు పంచాయతీ మదుగురు గ్రామం శివారు పొదల్లో ఓ నవజాత శిశువును గుర్తించారు. ఐసీడీఎస్ సీడీపీఓ విజయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో పొదల్లో నుంచి పసికందు ఏడుపులు వినిపిస్తుండటంతో పొలం నుంచి వస్తున్న పొడియం గంగయ్య, కన్నమ్మ అటుగా వెళ్లి చూసి పసిపాపను గుర్తించారు. పసికందును వారు ఇంటికి తీసుకొచ్చి సమాచారాన్ని ఎంఎల్‌హెచ్ పీఎస్‌కు తెలిపారు. పొదల్లో ఉన్న నవజాత శిశువు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సీఐ గోపాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. శిశువును వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
చెట్టు నుంచి జారిపడి గీత కార్మికుడి మృతి


