ఎయిర్‌పోర్టుకు ప్రయాణికుల తాకిడి
ఫ తిరుగు ప్రయాణికులతో సందడి
ఫ రోజూ 1400 మంది పయనం
ఫ రోజుకు 9 సర్వీసులు
ఫ ఈనెల 26 వరకు ఢిల్లీ సర్వీసు రద్దు
కోరుకొండ: మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి తగిలింది. సంక్రాంతి సెలవుల నిమిత్తం వచ్చిన ప్రయాణికులు తిరుగు పయనమవుతున్న నేపథ్యంలో ఆదివారం నుంచి సందడి నెలకొంది. విమానశ్రాయానికి డిల్లీ, హైదరాబాద్, చైన్నె, బెంగుళూరుకు డైలీ, ముంబాయ్, తిరుపతికి వీక్లీ సేవలందుతున్నాయి. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన 9 సర్వీసులు తిరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈనెల 12వ తేదీ నుంచి ప్రయాణికుల రాక మొదలయింది. కాగా సెలవుల అనంతరం ఆదివారం నుంచి తిరిగి వెనక్కి వెళ్లడంతో విమానాశ్రయంలో రద్దీ ఏర్పడంది. ఈ రాకపోకల సందర్భంగా విమానాశ్రయానికి 1,400 మంది చొప్పున రోజూ ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దీంతో ఈనెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వారం రోజులు 9 సర్వీసుల్లో 10 వేల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించారు. ఢిల్లీ నుంచి నిర్వహిస్తున్న బోయింగ్ విమాన సర్వీసు సేవలు ఈ నెల 26వ తేదీ వరకు 8 రోజుల పాటు నిలిచిపోతున్నట్టు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. దీంతో విమాన సర్వీసుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగానే సోమవారం ఢిల్లీ సర్వీసు రద్దయింది. అలాగే సోమవారం సాయంత్రం 6.55 గంటలకు హైదరాబాద్‌కు 72 మంది ప్రయాణికుల సామర్థ్యంతో మరో విమాన సర్వీసు ప్రారంభమయిందన్నారు. దీంతో హైదరాబాద్‌కు రెండు ఎయిర్‌బస్ సర్వీసులు, మూడు ఏటీఆర్ విమాన సర్వీసులు నడుపుతున్నారు.


