పదోన్నతి కల్పించాలంటూ ధర్నా
అమలాపురం రూరల్: ప్రభుత్వం సచివాలయ ఏఎన్‌ఎంలకు పదోన్నతులు కల్పించడంపై కోనసీమ జిల్లా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. స్టాఫ్ నర్సుల పోస్టులను ఏఎన్‌ఎంలకు కేటాయించడంతో తమకు అన్యాయం జరుగుతుందని వారు వాపోయారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల పోరాట కమిటీ జిల్లా అధ్యక్షురాలు ఎం.శివకుమారి మాట్లాడుతూ 115 జీవోకు వ్యతిరేకంగా ప్రభుత్వం సచివాలయం ఏఎన్‌ఎంలకు పదోన్నతులు కల్పిస్తుందన్నారు. తాము శిక్షణ పొంది 14 ఏళ్లుగా సేవలు అందిస్తున్నామన్నారు. స్టాఫ్ నర్సులు మాట్లాడుతూ తమ సేవలు, అర్హతలను గుర్తించాలని న్యాయమైన నియామక ప్రక్రియ, పదోన్నతులు కల్పించాలన్నారు.
ఉపాధ్యక్షురాలు అమృతవల్లి, స్టాఫ్ నర్సులు క్రిటికల్ పరిస్థితుల్లో పని చేస్తున్నారన్నారు. వైద్యులు లేకుండా భద్రతా సిబ్బంది లేకుండా, తగిన సౌకర్యాలు లేకుండా, సేవలు చేస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినితిపత్రం అందించారు. జిల్లా నాయకులు ఎం. ప్రశాంతి, జి.దుర్గమ్మ, పి.సుశీల, ఎం.కల్యాణి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.


