కేసీఎం చొరవతో స్వదేశానికి వచ్చాను
అమలాపురం రూరల్: ఉపాధి నిమిత్తం ఖతార్‌కు వెళ్లి ఇటీవల ఇబ్బంది పడి కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం) చొరవతో స్వదేశానికి క్షేమంగా చేరుకున్న ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి చెందిన పి.వెంకటలక్ష్మి జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌ను కలసి సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. ఖతార్‌లో ఎదుర్కొన్న ఇబ్బందుల పూర్వాపరాలను ఆమెను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఆమె తన బాధ చెప్పుకుంటూ అక్కడ ఎంత బాధ పడిందో వివరించింది. ఖతార్‌లో తన సోదరి ద్వారా కేసీఎం గురించి తెలుసుకుని తన సోదరుడు కోనసీమ వలసదారుల కేంద్రానికి పంపించి సంప్రదించగా కేసీఎం బృందం సమస్యను తెలుసుకుని భారత రాయబార సంస్థతో సంప్రదింపులు జరిపి క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చారని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఈ కేసీఎం ఏర్పాటు చేయడం మాలాంటి ఇతర దేశాల్లో ఇబ్బందులు పడుతున్నటు వంటి అనేక మందికి శ్రీరామరక్షగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో మేనేజర్ గోళ్ళ రమేష్, కె.సత్తిబాబు, సఫియా, దుర్గ పాల్గొన్నారు.


