సార్లంక బాధితులను వెంటనే ఆదుకోవాలి
● 3 సెంట్ల స్థలంలో
పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి
● పూర్తి స్థాయి ఆర్థిక సహకారం
అందించాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా డిమాండ్
● అగ్నిప్రమాద బాధితులకు పరామర్శ
రౌతులపూడి: మండలంలోని రాఘవపట్నం శివారు సార్లంక గిరిజన గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని మజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబుతో కలసి ఆయన సార్లంక గ్రామంలో ఆదివారం పర్యటించారు. నిలువ నీడ కోల్పోయి.. తీవ్రమైన చలిలో గజగజా వణికిపోతూ జీవనం సాగి స్తున్న బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇంటింటికీ తిరిగి ప్రమాదానికి గల కారణాలను, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, మారుమూల కుగ్రామంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. స ర్వం కోల్పోయి, వారం రోజులుగా చెట్లు, టార్పాలిన్ల కింద తల దాచుకుంటున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కేవలం రూ.25 వేలు ఇచ్చి చేతులు దులు పుకొందని విమర్శించారు. వెంటనే గ్రామానికి ఆనుకు ని ఎకరం భూమి కొనుగోలు చేసి, ఒక్కో బాధిత కుటుంబానికి 3 సెంట్ల స్థలం ఇచ్చి, పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులు తేరుకునేంత వరకూ వారి జీవన భృతికి పూర్తి ఆర్థిక సహకారం అందించాలని సూచించారు. ఈ ప్రాంతంలో వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజ నిక్షేపాలను మైనింగ్ చేసి, తరలిస్తున్న కంపెనీల సహకారం తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించాలని డిమాండ్ చేశారు.
అన్ని సర్టిఫికెట్లూ తిరిగి అందజేయాలి
అగ్ని ప్రమాదంలో గ్రామస్తులకు చెందిన ఆధార్, రేషన్ కార్డులు, కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలు, ఆస్తి పత్రాలు, విద్యార్థుల సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయని రాజా చెప్పారు. వారందరికీ ఆయా సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను తిరిగి ప్రభుత్వం అందించాలని, దీనికోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు.
బాధితులకు భరోసా
అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన అందరికీ వైఎస్సా ర్ సీపీ అండగా ఉంటుందని, పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని దాడిశెట్టి రాజా, ముద్రగడ గిరిబా బు భరోసా ఇచ్చారు. 34 బాధిత కుటుంబాలకు రా జా రూ.10 వేల చొప్పున నగదు సాయం అందించా రు. అలాగే, ఎంఎంఆర్ ట్రస్ట్ అధినేత, వైఎస్సార్ సీపీ నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు రూ.5 వేల చొప్పున నగదు, దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు, అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంగూరి లక్ష్మీ శివకుమారి, రౌతులపూడి, తుని, ప్రత్తిపాడు జెడ్పీటీసీ సభ్యులు గొల్లు చినదివాణం, పోతల రమణ, బెహరా రాజేశ్వరి, పార్టీ తొండంగి మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి అడపా సోమేష్, సీనియర్ నాయకులు వాసిరెడ్డి భాస్కరబాబు, నాగం దొరబాబు, దళే చిట్టిబాబు, బదిరెడ్డి గోవిందు, గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, గౌతు స్వామి, ఎస్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు చెన్నాడ సత్తిబాబు, రాష్ట్ర కార్యదర్శి, చెన్నాడ భీమరాజు, జల్దాం సర్పంచ్ యాదాల లక్షి తదితరులు పాల్గొన్నారు.


