ప్రాణం నిలబెట్టు.. ప్రోత్సాహకం పట్టు
ఫ జీరో అవర్‌లో సేవలు అందిస్తే
రూ.5 వేలు, జ్ఞాపిక
ఫ గుడ్ సమ్మరిటన్ పేరుతో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం
బాలాజీచెరువు (కాకినాడ): ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. రోజుకు ఇద్దరు, లేక ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం, అలాగే గాయపడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.. ఈ ప్రమాదాలతో బాధిత కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. జీరో అవర్‌లో సరైన వైద్య సేవలు అందకపోవడంతోనే మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. దీనిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ప్రాణదాతలకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి కాపాడే వారిని సత్కరించి జ్ఞాపికతో పాటు రూ.5 వేలు ఇవ్వనుంది. దేశ వ్యాప్తంగా గుడ్ సమ్మరిటన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం రూపొందించిది. దీనిపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు వైద్య శాలలు, ముఖ్య కూడళ్లు, జాతీయ రహదారులు వంటి ప్రాంతాల్లో డాక్టర్లు, ఏంవీఐలు కరపత్రాలు పంపిణీతో పాటు వాల్ పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఎటువంటి సమస్య రాకుండా..
చాలా మంది ప్రమాదాలు జరిగినప్పుడు 104, 108 వంటి అత్యవసర నంబర్లకు సమాచారం ఇవ్వాలనే ఆలోచన వచ్చినా, పోలీసులతో తలనొప్పి ఎందుకని మిన్నకుండిపోతున్నారు. ఇటువంటి వాటికి చెక్ పెట్టడానికి సమాచారం ఇచ్చిన వారికి పోలీసులతో ఎటువంటి సమస్య తలెత్తకుండా నిబంధనలు మార్చారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే క్షత్రగాత్రులకు జీరో అవర్‌లో సేవలు అందించిన వారికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ రూ.5 వేల నగదు ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఎక్కువ మంది ప్రాణాలు కాపాడిన వారికి జాతీయ స్థాయిలో పురస్కారం అందజేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ కార్యక్రమం నిమిత్తం జిల్లాకు కొంత నగదు ముందుగానే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
నిబంధనల్లో మార్పు
రోడ్డు ప్రమాదంలో సహాయం చేసిన వారి వివరాలు తప్పని సరిగా ఇవ్వాలనే నిబంధనలు మార్పు చేశారు. వారికి ఇష్టమైతేనే వివరాలు ఇవ్వవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన గుడ్ సమ్మరిటన్ కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నాం. జాతీయ రహదారి అధికంగా విస్తరించిన ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్, వైద్య శాఖల సమన్వయంతో అవగాహన కల్పిస్తున్నాం.
–కె.శ్రీధర్, కాకినాడ జిల్లా రవాణాశాఖ అధికారి


