ధగధగ మెరుపులతో..
బంగారు ఆభరణాలతో సమానంగా ఇమిటేషన్ నగలు ధగధగ మెరుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మార్కెట్లో ఇమిటేషన్ జ్యుయలరీ కొత్త డిజైన్లలో వస్తున్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, తుని పట్టణాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా కొత్తగా ఇమిటేషన్ నగల దుకాణాలు ప్రారంభించారు. అక్కడ మహిళలకు నచ్చిన కొత్త డిజైన్లు అందుబాటులో ఉంటున్నాయి. వేసుకునే డ్రెస్‌లు, చీరలను బట్టి మ్యాచింగ్ డిజైన్లు దొరుకుతుండడంతో మహిళలు ఎక్కువగా వీటినే కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో బంగారు నగల షాపులతో పోటీగా వివిధ కంపెనీల పేరుతో ఇమిటేషన్ నగల దుకాణాలు వెలుస్తున్నాయి. బంగారం షాపులే అన్నట్లుగా ఉంటున్న ఈ షాపులు కూడా ఇటీవల కాలంలో రద్దీగా మారుతున్నాయి.
● గుర్తు పట్టలేనంతగా..
ఇమిటేషన్ నగలు బంగారు నగలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటున్నాయి. బర్త్ డే ఫంక్షన్ నుంచి పెళ్లిళ్ల వరకూ ఈ నగలనే వేసుకుంటున్నాం. బంగారు నగలు ఉన్నప్పటికీ ఇమిటేషన్ నగలకే ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇవి వివిధ రకాల కొత్త డిజైన్లలో ఉంటున్నాయి.
–బీఎస్ సునీతాలక్ష్మి, ఉపాధ్యాయురాలు, ద్రాక్షారామ
● అందరికీ అందుబాటులో..
పేద, మధ్య తరగతి ప్రజలకు సైతం అందుబాటులో ఇమిటేషన్ నగలు దొరుకుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధర రోజు రోజుకూ పెరుగుతున్న తరుణంలో ఇమిటేషన్ నగలకు ప్రాధాన్యం పెరుగుతుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ నగలు ఒక కానుక అని చెప్పవచ్చు. ఎక్కడైనా పోగొట్టుకున్నా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. –జి.త్రివేణిస్వాతి, గృహిణి, కాకినాడ
ధగధగ మెరుపులతో..


