తల్లిదండ్రుల చెంతకు బాలుడు
సామర్లకోట: తప్పిపోయిన మూడేళ్ల బాలుడిని ట్రాఫిక్ పోలీసులు అతడి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. కొప్పిశెట్టి జానకిరామ్, దేవి దంపతులు తమ కుమార్తె, కుమారుడితో కలిసి మంగళవారం సాయంత్రం సామర్లకోట రైల్వే స్టేషన్‌లో దిగారు. వారందరూ సామర్లకోట నుంచి కరప మండలం విజయరాయుడుపాలేనికి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆటోను మాట్లాడుతున్న సమయంలో వారి మూడేళ్ల కుమారుడు తుస్యంత్ ఆద్య అదృశ్యమయ్యాడు. దీంతో రైల్వే స్టేషన్ ఆవరణలో వెతకడం ప్రారంభించారు. ఎంతకీ కనిపించక పోవడంతో అవుట్ పోస్టు పోలీసు స్టేషన్‌కు వచ్చి ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావుకు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్టేషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా బాలుడు జయలక్ష్మి థియేటర్ రోడ్డులో ఏడుస్తూ ఉన్నట్లు గమనించారు. వెంటనే తమ సిబ్బంది పంపించి, బాలుడిని అవుట్ పోస్టు పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి బాలుడిని క్షేమంగా వారికి అప్పగించారు.


