రాజకీయ ప్రచారానికి కార్మికుల సొమ్ము వాడతారా?
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధుల్లో రూ.20 కోట్లు ప్రభుత్వ ప్రచారానికి వాడాలని కార్మిక శాఖ చేసిన నిర్ణయంపై భవన నిర్మాణ కార్మికులు భగ్గుమన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం (సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ, చంద్రబాబు సర్కార్ రాజకీయ ప్రచారానికి కార్మికులు దాచుకున్న సంక్షేమ బోర్డు నిధులు రూ.20 కోట్లు వాడాలని నిర్ణయించడం సిగ్గుచేటన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని, లేని పక్షంలో కూటమి బలపరచిన పంచాయతీ అభ్యర్థులను ఓడించి, బుద్ధి చెప్తామని హెచ్చరించారు. విగ్రహాల కోసం వేల కోట్లు ఖర్చు చేసే బదులు, ఏడేళ్లుగా ప్రమాదాలు, అనారోగ్యంతో మరణించిన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు పరిహారాలు చెల్లిస్తే వారికి ఊరట లభిస్తుందని హితవు పలికారు. ఖజానాపై ఒక్క రూపాయి భారం లేకుండా సంక్షేమ బోర్డు నిర్వహించే అవకాశం ఉన్నా, అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకి ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓరుగంటి నందీశ్వరుడు, జిల్లా గౌరవాధ్యక్షుడు గడిగట్ల సత్తిబాబీ, సలహాదారు కరణం విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.


