పొల్యూషన్ శాఖ ఈఈగా సూర్యకళ
కాకినాడ రూరల్: కాలుష్య నియంత్రణ మండలి కాకినాడ రీజనల్ కార్యాలయం ఈఈగా ఐ.సూర్యకళ నియమితులయ్యారు. విశాఖలోని ఏపీపీసీబీ కార్యాలయంలో పనిచేసిన ఆమె పదోన్నతిపై కాకినాడ బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు పనిచేసిన శంకరరావు సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరుగా పదోన్నతిపై కర్నూలు జోనల్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన సూర్యకళకు రమణయ్యపేటలోని కార్యాలయంలో శనివారం ఆయన బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. ఆమెకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు.
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి ఆలయం, వ్రత మండపాలు, క్యూ లు భక్తులతో నిండిపోయాయి. ఆలయాన్ని తెల్లవారుజామున నాలుగు గంటలకు తెరిచి పూజలు చేశారు. అనంతరం వ్రతాల నిర్వహణ ప్రారంభించారు. ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణునికి పూజలు చేశారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
నేడు సత్యదేవుని రథ సేవ
ఆదివారం రత్నగిరి ఆలయ ప్రాకారంలో ఉదయం పది గంటలకు టేకు రథంపై సత్యదేవుడు, అమ్మవారిని ఊరేగిస్తారు. భక్తులు రూ.2,500 టిక్కెట్‌తో ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఒక టిక్కెట్ మీద నలుగురిని అనుమతిస్తారు. ఊరేగింపు అనంతరం ఆ భక్తులకు స్వామివారి అంతరాలయ దర్శనం, పండితులతో వేదాశీర్వచనం, స్వామివారి కండువా, జాకెట్టు ముక్క, ప్రసాదం అందజేస్తారని అధికారులు తెలిపారు.
శృంగార వల్లభస్వామి
ఆలయానికి భక్తుల తాకిడి
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలంలోని తిరుపతి గ్రామంలో వేంచేసి యున్న శృంగార వల్లభ స్వామిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ధనుర్మాసం సందర్భంగా ధ్వజస్తంభంతో పాటు ఆలయ ప్రాంగణం పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు వచ్చారు. కొందరు కాలినడకన ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 10వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,00,620 అన్నదాన విరాళాలకు రూ.63,611, కేశ ఖండన ద్వారా రూ.1,720, తులాభారం ద్వారా రూ.350, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.12,630లతో కలిపి రూ.1,78,931 ఆదాయం వచ్చిందని చెప్పారు. 3,200 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు.
యూరియా కొరత లేకుండా
చర్యలు తీసుకోవాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో రబీ సీజన్‌లో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, మండల స్థాయి వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి యూరియా వినియోగంపై అవగాహన కల్పించాలని జేసీ అపూర్వ భరత్ ఆదేశించారు. కలెక్టరేట్ లో శనివారం జేసీ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారులు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, కృత్రిమ కొరత, ఎమ్మార్పీ, ఎరువులు మళ్లింపు వంటి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐవీఆర్‌ఎస్ ఫీడ్ బ్యాక్ మెరుగుపడే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని జేసీ సూచించారు.
పొల్యూషన్ శాఖ ఈఈగా సూర్యకళ
పొల్యూషన్ శాఖ ఈఈగా సూర్యకళ


