అన్నవరం ఆలయ శానిటరీ కాంట్రాక్ట్ సిబ్బంది నిరసన
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈఓ మారినా, పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వచ్చినా వివాదాలు మాత్రం కొనసాగుతున్నాయి. తాజాగా దేవస్థానంలో శానిటరీ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న పద్మావతి హాస్పిటాలిటీ, బుక్ కీపింగ్ అండ్ శానిటరీ సంస్థలో పనిచేస్తున్న సుమారు 200 మంది మహిళా సిబ్బందిని శనివారం దేవస్థానంలో ఇతర ప్రదేశాలకు బదిలీ చేయడం వివాదాస్పదమైంది. తమను కావాలనే మార్చారని సిబ్బంది శనివారం సాయంత్రం టోల్‌గేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు రత్నగిరికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా శానిటరీ వర్కర్స్ దడాల నానితల్లి, పెండ్యాల నాగలక్ష్మి మాట్లాడుతూ తాము ఆలయ ప్రాంగణం, రోడ్లు, టాయిలెట్స్ తదితర ప్రాంతాలలో పని చేస్తున్నామని, మళ్లీ అటువంటి ప్రదేశాలకే మార్చారని వీరు ఆరోపించారు. తాము మూడు నెలలుగా ఒకే చోట పనిచేస్తున్నామని తెలిపారు. తాము 15 సంవత్సరాలుగా దేవస్థానంలో శానిటరీ విభాగంలో కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నామని, గతంలో ఎప్పుడు ఇలా మార్చలేదని తెలిపారు. కొన్ని నెలలు ఆలయం, వ్రత మండపాలు వద్ద పనిచేసేవారమని తెలిపారు. అయితే పద్మావతి సంస్థలో కొత్తగా నియమించిన సిబ్బందిని వ్రత మండపాలు, స్వామివారి ఆలయం, అతిథి గృహాలు తదితర చోట్ల కొనసాగిస్తున్నారని తెలిపారు. వారు మూడు నెలలు దాటినా అక్కడే పనిచేస్తున్నారని తమని మాత్రం బాత్‌రూమ్స్ క్లీనింగ్, రోడ్లు క్లీనింగ్ పనులకే పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. సూపర్‌వైజర్ సతీష్ తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దేవస్థానం శానిటరీ ఇనస్పెక్టర్ వేంకటేష్ వారితో మాట్లాడి ఈ విషయం కాంట్రాక్టర్ దృష్టికి తీసుకువెడతానని తెలపడంతో ఆందోళన విరమించారు.
అందరినీ మార్చాలని సూపర్
వైజర్‌ను ఆదేశించాం
అన్నవరం దేవస్థానంలో మా సంస్థ తరఫున 413 మంది శానిటరీ విధులు నిర్వహిస్తున్నారు. అందరినీ విడతల వారీగా మార్చాలని సూపర్‌వైజర్‌ను ఆదేశించాం. ఈ నెల కొంతమందిని మార్చితే, వచ్చేనెల మిగిలిన వారిని మార్చుతారు. ఎవరి మీదా కక్ష లేదు. అందరినీ సమానంగా చూస్తున్నాం.
– భాస్కరనాయుడు, ఎండీ, పద్మావతి సంస్థ


