సంపూర్ణ ఉపనిషత్సారం గీత
సమన్వయ సరస్వతి సామవేదం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): సంపూర్ణ ఉపనిషత్సారం గీత. గంగ, గాయత్రి, గీత ఎవరి హృదయంలో ఉంటాయో వారికి పునర్జన్మ ఉండదని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శనివారం హిందూ సమాజంలో ఆయన వేదవ్యాసుడు ప్రసాదించిన భారతం, భీష్మపర్వంలోని యుద్ధ విశేషాలను వివరించారు. వర్షం మంచిదే, ఎప్పుడు ఎక్కడ పడాలో, ఎంత పడాలో అలా పడినప్పుడే మంచి ఫలితం వస్తుంది. దయ అనేది కూడా సర్వదా అభిలషనీయం కాదు, సమయం, సందర్భాన్ని పట్టి దయ అనేది చూపాలని సామవేదం అన్నారు. ఇరుపక్షాలు కురుక్షేత్రంలో మోహరించినప్పుడు ధర్మరాజు కవచం, ఆయుధాలు విసర్జించి భీష్ముని వద్దకు వెళ్లాడు. ఎవరికీ ఆయన అంతరంగం అర్థం కాలేదు. తాతా! యుద్ధంలో మాకు జయం కలగాలని దీవించమని ధర్మరాజు కోరాడు. నీవు ఇలా రాకపోతే, నిన్ను శపించేవాడినని భీష్ముడు అన్నాడు. ద్రోణ, కృపాచార్య, శల్యుల వద్దకు ఈ రీతిగానే వెళ్లి వారి ఆశీస్సులు తీసుకున్నాడు ధర్మరాజు. ఆ తరువాత ఉభయ పక్షాల మధ్య నిలబడి, యుద్ధంలో మా పక్షాన నిలబడి పోరాడాలని ఎవరయినా రావాలనుకుంటే, రమ్మని ఆహ్వానిస్తున్నామని ఆయన ప్రకటించాడు. ధృతరాష్ట్రునికి ఒక వైశ్య కాంత వలన జన్మించిన యుయుత్సుడు పాండవ పక్షానికి వచ్చాడు. యుద్ధం ముగిసాక, ధార్తరాష్ట్రులకు పిండోదకాలు సమర్పించడం నీ బాధ్యతలాగా కనిపిస్తున్నది అని ధర్మరాజు అన్నాడు. అనేక యుద్ధ వ్యూహాలను సామవేదం వివరించారు. యుద్ధ సమయం నాటికి ద్రోణుని వయసు 400 సంవత్సరాలు. ‘యతో ధర్మస్తతః జయః, యతః కృష్ణస్తతో జయః–అన్న ద్రోణుని మాటలను భారత నినాదంగా పరిగణించాలని సామవేదం అన్నారు. యుద్ధ సమయంలో ధర్మరాజు చూపిన నీతిని మ్లేచ్ఛులు, ఆర్యులు సైతం అభినందించారు. ఆర్యులు, ద్రావిడులు అనే విభాగాలు పాశ్చాత్యుల సృష్టి మాత్రమేనని భారతదేశమంతా ఆర్యావర్తమేనని సామవేదం అన్నారు. విరాటరాజు కుమారుడు ఉత్తరుడు శల్యునితో వీరోచితంగా యుద్ధం చేసి మరణిస్తాడని సామవేదం అన్నారు. దుర్యోధనుని పరుషమైన మాటలతో కలత చెంది భీష్ముడు మండలాకారంలో బాణాలు ప్రయోగించి, రథం మీద నాట్యం చేస్తున్నట్టు కనపడతాడు. స్మరణ మాత్రాన సుదర్శన చక్రం కృష్ణుని చేతికి వచ్చింది. పార్థుని కోర్కైపె చక్రాన్ని కృష్ణుడు ఉపసంహరించుకుంటాడు. ముందుగా భాగవత విరించి డాక్టర్ టీ వీ నారాయణరావు పోతనామాత్య విరచితమైన ‘వేదాంత వీధుల విహరించు విన్నాణి..’ పద్యాన్ని ఆలపించి సభకు శుభారంభం పలికారు.


