
కూలిపనికి వెళ్తుండగా మృత్యు ఒడిలోకి..
లారీ ఢీకొని ఇద్దరి దుర్మరణం
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు మండలం సీతంపేట రంగా విగ్రహం సెంటర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే పెరవలి మండలం కానూరు అగ్రహారానికి చెందిన దవులూరి సుబ్రహ్మణ్యం (44), లంకే ప్రసాద్ (26) రోజూ మాదిరిగానే శనివారం తెల్లవారుజామున 6.30 సమయంలో కడియపులంకలో పూల కుండీల లోడింగ్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. విజ్జేశ్వరం–సీతంపేట సమీపంలోని రంగా విగ్రహం సెంటర్ వద్దకు వారు వచ్చే సరికి కొవ్వూరు వైపు వస్తున్న లారీ వెనుక నుంచి వారిని బలంగా ఢీకొట్టింది. దీంతో వారు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్సై శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సమాచారం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్ కొవ్వూరు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. తక్షణ సాయంగా బాధిత కుటుంబాలకు చెరో రూ.10 వేలు అందించారు. ప్రభుత్వం తరఫున సాయం అందించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

కూలిపనికి వెళ్తుండగా మృత్యు ఒడిలోకి..