కన్నీటి వరదకు కట్టడేదీ! | - | Sakshi
Sakshi News home page

కన్నీటి వరదకు కట్టడేదీ!

Aug 10 2025 6:16 AM | Updated on Aug 10 2025 6:16 AM

కన్నీ

కన్నీటి వరదకు కట్టడేదీ!

ఆదివారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2025

8

లో

ఎన్నిసార్లు చెప్పినా

పట్టించుకోడం లేదు

మాధవపురం గండి పూడ్చి, మా పంటలు కాపాడాలని ఎన్నిసార్లు మొర పెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోడం లేదు. దీనిపై పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (పాడా) గ్రీవెన్స్‌ సెల్‌లో కూడా అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా ఫలితం లేదు. ఇది పెద్ద గండి పని చేయడం సాధ్యం కాదని వదిలేసినట్లు ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. ఈ గండి వల్లే ఊళ్లకు ఊళ్లు, వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయనే విషయాన్ని అధికారులు గుర్తించాలి. వరద వస్తే ఏలేరు అదనపు జలాలు, పీబీసీ నీరు ఒకేసారి వచ్చి పడడం వల్ల ఈ కాలువపై ఒత్తిడి పెరుగుతోంది. ఆవిధంగానే దీనికి గండి పడింది. ఈ గండి వల్ల గత ఏడాది సుమారు 2 వేల ఎకరాల్లో వరి పంట, వందలాది ఇళ్లు నీట మునిగాయి. ఇప్పటికై నా ఈ గండిని పూడ్చి, గట్టును పటిష్టపరచకపోతే మరోసారి పలు గ్రామాల్లో వేలాది ఎకరాలు నీట మునగడం ఖాయంగా కనిపిస్తోంది.

– వై.ప్రసాదరెడ్డి, రైతు, నాగులాపల్లి,

యు.కొత్తపల్లి మండలం

పిఠాపురం: గత ఏడాది సెప్టెంబర్‌ రెండో వారం.. ఎడతెరిపి లేకుండా వానలు.. ఏలేశ్వరం వద్ద ఉన్న ఏలేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది.. షరా మామూలుగానే అదనపు జలాలను అధికారులు దిగువకు విడిచిపెట్టడం ప్రారంభించారు. మామూలుగా ఏలేరు ప్రవాహ సామర్థ్యం 4 వేల క్యూసెక్కులు. కానీ, దానికి దాదాపు ఏడు రెట్లు మించి ఏలేరులోకి ఒకేసారి 27 వేల క్యూసెక్కుల నీటిని వదిలేశారు. దీంతో, ఒక్కసారిగా వెల్లువలా విరుచుకుపడిన జలరాశి పరీవాహక ప్రాంతాలను ముంచెత్తింది. రోజుల తరబడి వరద నీటిని వదిలేయడంతో వేలాది ఎకరాల్లో పంటలు, పదుల సంఖ్యలో ఊళ్లు నీట మునిగాయి. అపార నష్టం వాటిల్లింది. ఏరువాక సాగి.. దుక్కి దున్ని.. నారు పోసి.. దమ్ము చేసి.. నాట్లు వేసి.. ఉన్నదంతా పంటకు పెట్టుబడి పెట్టి.. ఫలసాయం అందుతుందని ఆశించిన అన్నదాతకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మరో పది రోజుల్లో పొట్ట దశకు వస్తుందనుకున్న వరి పంట కాస్తా ముంపు బారిన పడింది. దీనికి తోడు వందలాది ఎకరాల్లో ఇసుక, మట్టి మేటలు వేయడంతో వారికి రెండింతల నష్టం జరిగింది. పిఠాపురం మండలం రాపర్తి ప్రాంతంలో ఏలేరు కాలువకు గండి పడటంతో వరి పొలాల్లో సుమారు 2 అడుగుల ఎత్తున ఇసుక మేటలు వేసింది. దీనిని తొలగించుకోడానికే రైతులకు వేలాది రూపాయలు వదిలిపోయాయి. వరద నీటి ధాటికి కాలువ గట్లకు పెద్ద సంఖ్యలో గండ్లు పడ్డాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో ఊహకందని రీతిలో ఏకంగా రూ.150 కోట్ల మేర నష్టం సంభవించింది. వాస్తవానికి సుమారు 50 వేల క్యూసెక్కుల నీటిని ఒకేసారి వదిలేశారని, అందువల్లనే ఇంత భారీ స్థాయిలో నష్టం జరిగిందని స్థానికులు చెబుతారు.

ముందస్తు చర్యలేవీ!

ఇంతటి మహావిపత్తు సంభవించినప్పుడు ఏ ప్రభుత్వమైనా వెంటనే మేల్కొంటుంది. మళ్లీ అటువంటి పరిస్థితి తలెత్తితే ప్రజలకు, వారి ఆస్తులకు తగిన రక్షణ కల్పించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటుంది. కానీ, దాదాపు ఏడాదవుతున్నా అటువంటి చర్యలే కానరావడం లేదు. నాటి వరదలకు పంటలన్నీ నీట మునిగి నాశనమైపోయినా ప్రభుత్వం నిబంధనల పేరుతో మొక్కుబడిగా ఎకరానికి రూ.10 వేలు మాత్రమే పరిహారం ఇచ్చి, చేతులు దులుపుకొంది. అది కూడా కొంతమందికి ఇవ్వకుండా ఆపేశారని రైతులు ఆరోపిస్తున్నారు.

తప్పని కడ‘గండ్లు’

నాటి వరదలతో ఏలేరు గట్లకు 290 చోట్ల గండ్లు పడ్డాయి. వీటిల్లో 243 గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చాలని అప్పట్లోనే అధికారులు గుర్తించారు. కానీ, ఇప్పటి వరకూ తొలి విడతలో రూ.2.28 కోట్లతో 28, మలి విడతలో రూ.3.51 కోట్లతో 39 గండ్లు మాత్రమే పూడ్చారు. మలివిడత పనులకు ఇప్పటి వరకూ ప్రభుత్వం బిల్లులే మంజూరు చేయలేదు. ఇవి కాకుండా మరో 211 పనులు చేపట్టడానికి రూ.18.16 కోట్లతో ప్రతిపాదించారు. వీటికి కూటమి ప్రభుత్వం ఇప్పటికీ మోక్షం కల్పించలేదు. దీంతో, ఈ ఏడాది వరదలు వస్తే తమకు మళ్లీ కడగండ్లు తప్పవని ఏలేరు ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

గోదా‘వర్రీ’ తోడు

ఏలేరు జలాశయంలో తగినంత నీటి నిల్వలు లేవనే పేరుతో ప్రభుత్వం కొద్ది రోజులుగా సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి గోదావరి జలాలను ఏలేరు జలాశయంలోకి తరలిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏలేరు జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరితే.. దానిని దిగువకు వదిలేయడం తప్ప వేరే మార్గం ఉండదు. అదే కనుక జరిగితే ఏలేరు పరీవాహక ప్రాంతాలకు మరోసారి వరద ముప్పు తప్పదని స్థానిక ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి వరదలు వస్తే సుమారు 1.50 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునుగుతాయని అంటున్నారు. వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మాత్రం కానరావడం లేదు. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గంలోనే ఈ దుస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

మండలాల వారీగా దెబ్బ తిన్న ఇళ్లు

గొల్లప్రోలు 2,071

కొత్తపల్లి 1,109

పిఠాపురం 1,490

పిఠాపురం టౌన్‌ 58

ఏలేరు కాలువకు

పడిన గండ్లు 290

యుద్ధప్రాతిపదికన

పూడ్చాలని అధికారులు

నిర్ధారించిన గండ్లు 243

పూడ్చిన గండ్లు 67

తొలి విడత పూడ్చినవి 28

దీనికైన వ్యయం రూ.2.28 కోట్లు

తరువాత పూడ్చి గండ్లు 39

దీనికైన వ్యయం రూ.3.51 కోట్లు

మిగిలిన గండ్ల పూడ్చివేతకు

అంచనాలు రూ.18.16 కోట్లు

ఏలేరు ఆయకట్టుకు

పొంచి ఉన్న ప్రమాదం

గత వరదల్లో ముక్కలైన కాలువ గట్లు

రూ.కోట్లతో తూతూమంత్రంగా పనులు

గండ్లు పూర్తిగా పూడ్చని ప్రభుత్వం

మళ్లీ వరద వస్తే ముంపు ముప్పు

తప్పదని ఆందోళన

గత ఏడాది ఏలేరు వరద నష్టాలు ఇలా..

నియోజకవర్గంలో వరి సాగు 42 వేల ఎకరాలు

వరదలో చిక్కుకున్న పంట సుమారు 36 వేల ఎకరాలు

సాగు పెట్టుబడి ఎకరానికి రూ.25 వేలు

వరద నష్టం సుమారు రూ.150 కోట్లు

మండలాల వారీగా రైతులు నష్టపోయిన పంట విస్తీర్ణం (ఎకరాల్లో)

మండలం రైతులు పంట విస్తీర్ణం

పిఠాపురం 4,730 6,604

కొత్తపల్లి 3,099 5,192

గొల్లప్రోలు 2,922 4,334

కన్నీటి వరదకు కట్టడేదీ!1
1/5

కన్నీటి వరదకు కట్టడేదీ!

కన్నీటి వరదకు కట్టడేదీ!2
2/5

కన్నీటి వరదకు కట్టడేదీ!

కన్నీటి వరదకు కట్టడేదీ!3
3/5

కన్నీటి వరదకు కట్టడేదీ!

కన్నీటి వరదకు కట్టడేదీ!4
4/5

కన్నీటి వరదకు కట్టడేదీ!

కన్నీటి వరదకు కట్టడేదీ!5
5/5

కన్నీటి వరదకు కట్టడేదీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement