
శ్రుతి తప్పిన రుతురాగం
మందకొడిగా ఖరీఫ్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ నత్తనడకన సాగుతోంది. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మొత్తం 5,97,847 ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకూ 4,56,067 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడటంగమనార్హం. అంటే మొత్తం సాగులో 76 శాతం మాత్రమే నాట్లు పడ్డాయి. కోనసీమ జిల్లాలో 1,63,999 ఎకరాలకు గాను 1,23,117 ఎకరాల్లో (70 శాతం), తూర్పు గోదావరి జిల్లాలో 1,99,867 ఎకరాలకు గాను 1,74,638 ఎకరాల్లో (87 శాతం), కాకినాడ జిల్లాలో 2,33,981 ఎకరాలకు గాను 1,58,312 ఎకరాల్లో (67 శాతం) మాత్రమే నాట్లు వేశారు. కాకినాడ జిల్లాలో ఏలేరు, పంపా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్(పీబీసీ)తో పాటు పలు ప్రాంతాల్లో ఖరీఫ్ మందకొడిగా సాగుతోంది.
●
● ఉమ్మడి ‘తూర్పు’పై నైరుతి శీతకన్ను
● 48 మండలాల్లో లోటు వర్షపాతం
● ఖరీఫ్‌కు అడుగడుగునా అవాంతరం
● 5.97 లక్షల ఎకరాల ఆయకట్టులో
4.56 లక్షల ఎకరాల్లోనే సాగు
● గోదారి నీటి రాక సైతం అరకొర
● గత ఏడాది ఈ సమయానికి
1,895 టీఎంసీల ఇన్‌ఫ్లో
● ఈ ఏడాది వచ్చింది 937.420 టీఎంసీలే
సాక్షి, అమలాపురం: నైరుతి రుతుపవనాలు రాకుండానే.. మే నెలలో.. మండు వేసవిలో జోరుగా వర్షాలు కురిశాయి. ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలతో భారీ వర్షాలు కురుస్తాయని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్నదాతలు, ప్రజలు ఆశించారు. కానీ అడపాదడపా తప్ప వాన జాడ లేదు. గోదావరికి జూలై నెలలో అరుదుగా వరద వస్తుంది. ఇలా వచ్చిన ఏడాది.. ఆ తరువాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరదలు రావడం పరిపాటి. గత ఏడాది లాగే ఈసారి కూడా జూలైలో గోదావరికి రెండుసార్లు వరద పోటు తగిలినా పెద్దగా ఇన్‌ఫ్లో లేకుండా పోయింది. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో గోదావరిలో నీటి ఉరవడి తగ్గిపోయింది. ఇక రైతుల ఆశల పంట ఖరీఫ్ మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. గోదావరి డెల్టాలోనే నీరందడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోచ్చు. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేశాయి. అప్పుడప్పుడు తప్ప ఉమ్మడి జిల్లాలో వర్షం జాడే దాదాపు లేకుండా పోయింది. జూన్, జూలై నెలలతో పాటు ఆగస్టు నెలలో ఇప్పటి వరకూ లోటు వర్షపాతం నమోదైంది. వారంలో ఒక రోజు ఒక మోస్తరు వర్షం కురిస్తే మిగిలిన ఆరు రోజులూ వేసవిని తలపించేలా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతల ధాటికి సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ 32 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అరకొరగానే గోదావరి నీరు..
ఈ ఏడాది గోదావరి ఇన్‌ఫ్లో కూడా అంతంత మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇన్‌ఫ్లో సగం కూడా లేదు. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ నాటికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 1,895.571 టీఎంసీలుగా నమోదైంది. ఆ సమయానికి డెల్టాలోని మూడు ప్రధాన కాలువలకు 47.465 టీఎంసీలు నీరు విడుదల చేయగా సముద్రంలోకి 1,848.106 టీఎంసీల మిగులు జలాలను విడిచిపెట్టారు. అదే రోజు మూడు డెల్టా కాలువలకు 7,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, సముద్రంలోకి 7,33,886 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు.
కానీ, ఈ సంవత్సరం ఇప్పటి వరకూ ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 937.420 టీఎంసీల ఇన్‌ఫ్లో మాత్రమే నమోదైంది. దీనిలో 61.33 టీఎంసీలు పంట కాలువలకు విడుదల చేయగా 876.087 టీఎంసీలు సముద్రంలోకి విడిచిపెట్టారు. ప్రస్తుతం పంట కాలువలకు 14,700 క్యూసెక్కుల నీటిని వదులుతూండగా 1,18,480 క్యూసెక్కులు మాత్రమే సముద్రంలోకి వదులుతున్నారు. గత ఏడాది జులై నెలలో భారీ వరద చోటు చేసుకోగా తిరిగి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనూ గోదావరికి పెద్ద వరదలు వచ్చాయి. ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉండటంతో గత ఏడాది రబీకి ఢోకా లేకుండా పోయింది. కానీ, ఈ ఏడాది జూలై నెలలో గోదావరికి రెండుసార్లు మాత్రమే స్వల్పంగా వరద వచ్చింది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే రబీకి నీటి ఎద్దడి తప్పదనే ఆందోళన రైతుల్లో నెలకొంది.

శ్రుతి తప్పిన రుతురాగం

శ్రుతి తప్పిన రుతురాగం

శ్రుతి తప్పిన రుతురాగం