ఒక్క రూమ్‌ ప్లీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఒక్క రూమ్‌ ప్లీజ్‌

Aug 10 2025 6:16 AM | Updated on Aug 10 2025 6:16 AM

ఒక్క రూమ్‌ ప్లీజ్‌

ఒక్క రూమ్‌ ప్లీజ్‌

అన్నవరం: వివాహ సందడితో రత్నగిరి రద్దీగా మారింది. సత్యదేవుని సన్నిధిన శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. రత్నగిరిపై ఆదివారం, ఈ నెల 17న పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. రత్నగిరిపై దాదాపు 600 వసతి గదులుండగా వీటిలో 70 శాతం ఈ ముహూర్తాలకు రిజర్వ్‌ అయిపోయాయి. వాటికి సంబంధించిన చార్టులు కూడా సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన సత్రం గదుల కోసం కూడా వీఐపీల నుంచి పెద్ద ఎత్తున సిఫారసులు వస్తూండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్క రూమ్‌ ప్లీజ్‌ అంటూ పెళ్లి బృందాలు, భక్తులు వెంట పడుతూండటంతో దిక్కు తోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూండటంతో వారికి వసతి గదులు కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ వరకూ వసతి గదుల కేటాయింపునకు ముగ్గురు సూపరింటెండెంట్లతో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. వారు వీఐపీల సిఫారసులు, రిజర్వేషన్‌, ఖాళీలు, ఇతర వివరాలు పరిశీలించి గదులు కేటాయిస్తారు.

శ్రావణం.. పెళ్లిళ్ల సంరంభం

శుభప్రదమైన శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి నుంచీ ప్రతి రోజూ కొంగుముడి వేసుకున్న కొత్త దంపతులు సత్యదేవుని సన్నిధికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ శ్రావణంలో సత్యదేవుని సన్నిధిలో ఇప్పటికే 200కు పైగా వివాహాలు జరిగాయి. గత నెల 25వ తేదీన శ్రావణ మాసం ప్రారంభం కాగా 26 నుంచి వివాహాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ ఒక్కో ముహూర్తంలో 40 నుంచి 50 వివాహాలు జరిగాయి. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున రత్నగిరిపై 100 వివాహాలు జరగనున్నాయి. ఈ నెల 17వ తేదీ వరకూ రత్నగిరిపై అధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ప్రధానంగా 10, 11, 13, 14, 15, 17 తేదీల్లో రత్నగిరిపై సత్రం గదుల్లో దాదాపు 70 శాతం, వివాహ మండపాలన్నింటినీ పెళ్లి బృందాలు గత నెలలోనే రిజర్వ్‌ చేసుకున్నాయి. ఆ ముహూర్తాల్లో ఆలస్యంగా వివాహాలు నిర్ణయించుకున్న పెళ్లి బృందాల వారు గదులు, వివాహ మండపాలు లభ్యం కాక ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీద ఈ వివాహాలన్నీ ఏ వివాదాలూ లేకుండా సజావుగా జరిగితే అదే పదివేలనుకునే పరిస్థితి దేవస్థానంలో నెలకొంది.

వెల్లువలా భక్తులు

శ్రావణ పౌర్ణమి పర్వదినం, రెండో శనివారం సెల వు కావడంతో రత్నగిరికి భక్తులు వెల్లువెత్తారు. సుమారు 50 వేల మంది సత్యదేవుని దర్శించుకున్నారు. భక్తులు, నవదంపతులతో వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. రూ.2 వేల వ్రత మండపాలు చాలకపోవడంతో భక్తులు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారికి తిరుచ్చి వాహనంపై ఘనంగా ప్రాకార సేవ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవారిని ఆదివారం ఉదయం 10 గంటల నుంచి టేకు రథంపై ఊరేగిస్తారు. రూ.2,500 టికెట్టుతో ఈ సేవలో భక్తులు పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.

రత్నగిరిపై జోరుగా పెళ్లిళ్ల సందడి

70 శాతం సత్రాల గదులన్నీ

వివాహ బృందాలకు రిజర్వ్‌

మిగిలిన రూముల కోసం వీఐపీల సిఫారసులు

తలలు పట్టుకుంటున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement