
శృంగార వల్లభుని సన్నిధిలో భక్తుల రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 18 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా స్వామివారికి రూ.3,10,502 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు.. సుమారు 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం చేశామన్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా స్వామివారిని సీఆర్‌డీఏ కమిషనర్ కూనపురెడ్డి కన్నబాబు దంపతులు దర్శించుకున్నారు. ఆయనకు ఈఓ శ్రీనివాస్, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బ్యాటరీ కారు బహూకరణ
అన్నవరం: సత్యదేవుని ఆలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం కత్తెర శ్రీనివాసరావు, వైజయంతి దంపతులు, కుమారుడు కేశవానంద్ (హైదరాబాద్) రూ.10 లక్షల విలువైన బ్యాటరీ కారును శనివారం అందజేశారు. తన తండ్రి రామారావు జ్ఞాపకార్థం దీనిని బహూకరిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. కారు తాళాలను ఈఓ వీర్ల సుబ్బారావుకు అందజేశారు.
ధర్మకర్తల నియామకానికి
నోటిఫికేషన్
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకానికి దేవదాయ, ధర్మదాయ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు డిప్యూటీ కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు శనివారం తెలిపారు. 13 మంది సభ్యుల నియామకానికి హిందూ మతానికి చెంది ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను దేవస్థానం కార్యాలయంలో 20 రోజుల్లోగా అందజేయాలని కోరారు. కార్యాలయం పని వేళల్లో దరఖాస్తులు పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

శృంగార వల్లభుని సన్నిధిలో భక్తుల రద్దీ