
గోదావరి స్నానానికి వెళ్లి వస్తూ...
గోకవరం: వరలక్ష్మీ పర్వదినాన్ని పిల్లలతో కలిసి సంతోషంగా గడపాలని ఆ కుటుంబం అనుకుంది. ఇందుకోసం పిల్లలతో కలిసి రాజమహేంద్రవరంలో గోదా వరి స్నానానికి వెళ్లారు. తిరి గి తమ గ్రామానికి వస్తుండగా గ్యాస్ సిలిండర్ల లారీ రూపంలో అనుకోని ఉపద్రవం ఎదురై కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. గోకవరం మండలం బావాజీపేట గ్రామ శివారున గురువారం మధ్యాహ్నం బైక్‌ని గ్యాస్ సిలిండర్ల లోడు లారీ ఢీకొన్న ప్రమాదంలో ఏడేళ్ల బాలిక మృతి చెందగా, మూడేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు.
గోకవరం మండలం కామరాజుపేట దుళ్ల వీధికి చెందిన పండూరి రాంబాబు ఇటుకబట్టీలో పని చేస్తున్నాడు. అతనికి భార్య వరలక్ష్మి, కుమార్తె షణ్ముఖి (7), మూడేళ్ల బాలుడు పూర్ణకిరణ్‌తేజ ఉన్నారు. శుక్రవారం వరలక్ష్మీవ్రతాన్ని పురస్కరించుకుని గోదావరి స్నానం చేయాలని భార్యాభర్తలు కుమార్తె, కుమారుడితో కలిసి బైక్‌పై ఉదయం రాజమహేంద్రవరం వెళ్లారు. స్నానం ముగించుకుని వ్రతానికి కావాల్సిన పూజా సామగ్రి కొనుగోలు చేసి సంతోషంగా తిరిగి వస్తుండగా మధ్యాహ్నం సమయంలో బావాజీపేట శివారున పోలవరం వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ వీరి బైక్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమార్తె షణ్ముఖి, కుమారుడు పూర్ణకిరణ్‌తేజల తలకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఓ ప్రైవేటు వాహనంలో వారిని గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కాతమ్ముళ్లను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక షణ్ముఖి మృతి చెందింది. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై గోకవరం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై పవన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతితో కామరాజుపేటలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలిక స్థానికంగా ఒక ప్రైవేటు స్కూల్‌లో చదువుకుంటోంది. చదువులో ఎంతో చలాకీగా ఉండే బాలిక అర్ధంతరంగా తనువు చాలించడంతో విషాదం నెలకొంది. కళ్లముందే తమ చిన్నారులకు ఈ పరిస్థితి తలెత్తడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.
రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి మృతి
మూడేళ్ల బాలుడి పరిస్థితి విషమం
బైక్‌ను సిలిండర్ల
లోడు లారీ ఢీకొట్టడంతో ఘటన