
మూడు హత్యల కేసులో నిందితుడి అరెస్టు
కాకినాడ క్రైం: ఈ నెల 3వ తేదీన సామర్లకోట సీతారామకాలనీలో చోటు చేసుకున్న మూడు హత్యలవవ మిస్టరీ వీడింది. వివరాలను ఎస్పీ బింధుమాధవ్ బుధవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సామర్లకోట కొత్తపేట వీధికి చెందిన 35 సంవత్సరాల తలే సురేష్ అనే లారీ ఓనర్ కం డ్రైవర్‌కు సీతారామకాలనీకి చెందిన ములపర్తి మాధురి(29)తో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరికీ రెండు కుటుంబాలు ఉండగా ఎవరి కుటుంబంతో వారు కొనసాగుతూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే కొద్దికాలంగా మాధురి సురేష్‌తో భార్య జ్యోతిని వదిలేయాలంటూ గొడవ పడుతోంది. ఇదిలా ఉంటే, ఈ నెల 2వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో మాధురి సురేష్‌కు ఫోన్ చేసి ‘నా భర్త లేడు, ఇంటికి రా...’ అంటూ పిలిచింది. మాధురి వద్దకు వెళ్లిన సురేష్ పలు అంశాలపై మాట్లాడాడు. ఈ నేపథ్యంలో సురేష్ ఆమెకి వెచ్చించిన రూ.7 లక్షల నగదు విషయం చర్చకు వచ్చింది. ఘర్షణ జరగగా, అదే సందర్భంలో మాధురి సురేష్‌తో వాదులాడుతూ జ్యోతిని వదిలేయాలని మరోమారు రాద్ధాంతం చేసింది. దీంతో సహనం కోల్పోయిన సురేష్ అక్కడే ఉన్న దుడ్డు కర్రతో మాధురి తలపై బలంగా కొట్టాడు. ఆమె కేకలు వేయగా నిద్ర పోతున్న కుమార్తెలు పుష్పకుమారి(8), జెస్సీ(6)లు నిద్ర లేచి భయపడి గట్టిగా ఏడుస్తుండగా వారినీ అదే దుడ్డు కర్రతో తలలపై కొట్టి చంపేశాడు. తల్లి, ఇద్దరు పసిపిల్లల్ని చంపిన సురేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. లాయర్‌ను పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా నిందితుడు సురేష్‌ను సామర్లకోట సుగర్ ఫ్యాక్టరీ డంప్ యార్డు సమీపంలో అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి లారీ, 26 గ్రాముల బంగారు ఆభరణాలు, 123 గ్రాముల వెండి వస్తువులు, సెల్‌ఫోన్, హత్యకు వినియోగించిన దుడ్డు కర్రను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐ భగవాన్ సహా బృందాన్ని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.
భార్యను వదిలేయమన్నందుకే ఘాతుకం
ప్రియురాలు,
ఆమె పిల్లల్ని చంపేసిన ప్రియుడు
వివరాలు వెల్లడించిన ఎస్పీ బింధుమాధవ్