
కూటమి పాలనలో వారు అంటరానివారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు కూటమి పాలనలో దళితులను అంటరానివారిగా మార్చేశారని మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శించారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. కాకినాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో అంటరానితనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అత్యంత పవిత్రమైన టీటీడీలో చూద్దామంటే ఒక్క దళిత అధికారి కూడా కనిపించడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణతో చంద్రబాబు చేస్తున్నది తప్పు అని, వర్గీకరణపై పొరుగున ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలని హితవు పలికారు. ఎస్టీలు కూడా బాబు పాలనలో అన్యాయమైపోతున్నారన్నారు. మన్యంలో విలువైన ఖనిజాలపై పెద్దల కన్ను పడిందన్నారు. 2024లో ముమ్మాటికీ ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం అవినీతికి దగ్గరగా ఉందని ఆరోపించారు. వెయ్యి ఎకరాలు సరిపోతుంది అని బీవీ రాఘవులు చెప్పారు. చంద్రబాబు మాత్రం 70 వేల ఎకరాలు కావాలని తీసుకున్నారన్నారు. భూములు ఎలా ఇచ్చారని రైతులను అడుగుతుంటే ఇష్టం లేకున్నా మా కర్మకొద్దీ ఇచ్చామని చెబుతున్నారన్నారు. బంగారం పండే వేలాది ఎకరాలు లాగేసుకుని రాజధాని ప్రాంతంలో చంద్రబాబు అనుచరులు పెద్ద వ్యాపారం చేస్తున్నారని మోహన్ ఆరోపించారు. రాజధానిలో నిర్మాణాలు, పరిశ్రమల ఏర్పాటు కోసం ముందుకు వచ్చే వారితో చంద్రబాబు మనుషులు లాబీయింగ్ చేస్తున్నారన్నారు. 100 ఎకరాలు కావాలని అడుగుతున్న పొరుగు రాష్ట్రాల వారిని మీకు భూములు ఇస్తే మాకు ఏమిస్తారని బాబు అనుచరులు అడుగుతున్నారని మోహన్ చెప్పారు. రాజధాని కోసం రూ.50 వేల కోట్లు అప్పులు తెస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో అందరి తలలపైనా అప్పుల భారం మోపుతున్నారన్నారు. తల్లికి వందనం అమలు చేసి భార్యాభర్తల మధ్య చంద్రబాబు గొడవలు పెట్టాడన్నారు. భార్యల దగ్గర నుంచి భర్తలు సొమ్ము లాగేసుకుని మందు తాగేస్తున్న ఘటనలు కుప్పంలో తాను స్వయంగా చూశానన్నారు.
అమరావతిలో
రాజధాని నిర్మాణం కష్టం
70 వేల ఎకరాలతో
బాబు అనుచరుల వ్యాపారం
ముఖ్యమంత్రిపై మాజీ ఎంపీ చింతా ఫైర్