దేశంలో గూఢచర్యం! | - | Sakshi
Sakshi News home page

దేశంలో గూఢచర్యం!

Aug 5 2025 6:43 AM | Updated on Aug 5 2025 6:43 AM

దేశంలో గూఢచర్యం!

దేశంలో గూఢచర్యం!

నేతలపై నిఘా

మొబైల్స్‌ ట్యాప్‌ చేస్తున్నారని అనుమానాలు

‘అల్లుడు గారి’పై అసంతృప్తి

సీనియర్‌ నేతకు హ్యాండిస్తున్న వైనం

అయ్యన్న పంచకు ద్వితీయ శ్రేణి

సాక్షి ప్రతినిధి, కాకినాడ: గూఢచర్యం వ్యవహారం తుని ‘దేశం’లో కలకలం రేపుతోంది. ఆవిర్భావం నుంచీ టీడీపీలో ఉంటున్న తమ కదలికలపై మొన్న కాక నిన్న వచ్చిన ఓ నేత నిఘా పెడుతున్నారని సీనియర్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎక్కడకు వెళుతున్నాం.. ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నాం.. ఎవరి వద్ద ఎక్కువ సమయం గడుపుతున్నామనే వివరాలు తెలుసుకునేందుకు ఏకంగా వేగులను సైతం నియమించారని మండిపడుతున్నారు. చివరకు తమ ఆనుపానులు తెలుసుకునేందుకు మొబైల్‌ ట్యాపింగ్‌కు కూడా పాల్పడుతున్నారని కొంత మంది నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం తుని టీడీపీలో కలకలం రేపుతోంది. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని ఓ ‘అల్లుడు గారు’ తమ ఆనుపానులపై నిత్యం నిఘా పెడుతున్నారంటూ పార్టీలోని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీలో ఎన్నో ఒడుదొడుకులు చూసినా ఏనాడూ ఇటువంటి పరిస్థితి ఎదుర్కోలేదని పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ తరహా నిఘా వ్యవహారాలతో విసుగెత్తిపోయిన కొందరు సీనియర్లు పార్టీలో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు.

ఏం జరిగిందంటే..

పార్టీయేతరులతో టచ్‌లో ఉన్నారంటూ తన వేగులు అందించిన సమాచారంతో తమను ఆ అల్లుడు గారు అవమానకరంగా మాట్లాడారని తుని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కినుక వహించారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటోంది. పార్టీలోని ఓ కీలక నేతతో నాలుగు దశాబ్దాల పాటు వెన్నంటి ఉన్న మరో సీనియర్‌ నేత ఫోన్‌ ట్యాప్‌ చేయించారనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది. తాండవ షుగర్స్‌ మాజీ చైర్మన్‌, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి, తుని రూరల్‌లో క్రియాశీలకంగా ఉన్న సీనియర్‌పై నిఘా పెట్టిన విషయం కూడా ఇటీవల లీకై ంది. ఇన్నేళ్ల టీడీపీ అనుబంధంలో తన ప్రవర్తన ముఖ్య నేతలు అనుమానించేలా ఎన్నడూ లేదని ఆ నాయకుడు ఒక ముఖ్య నాయకుడి వద్ద ఆవేదన చెందారని చెబుతున్నారు. నిఘా ఎదుర్కొన్న సంబంధిత సీనియర్‌ నాయకుడు ఒకింత ఆగ్రహంతో అల్లుడు గారి అనుచరగణాన్ని ఇటీవల కడిగి పారేశారని పార్టీలో విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఈ పరిణామాలతో విసుగెత్తిన ఆ నేత ఇటీవల తుని నియోజకవర్గంలోని కీలక నేత చేయి వదిలేశారని.. పొరుగునే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్న శాసన సభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడి అనుచరులతో టచ్‌లోకి వెళ్లారని అంటున్నారు. అలా చేయక తప్పలేదని ఆ నాయకుడు బహిరంగంగానే చెబుతున్నా తునిలోని కీలక నేత కోటరీ నోరు మెదపడం లేదు. తుని పట్టణంతో పాటు తొండంగి, తుని రూరల్‌ మండలాల్లోని మరికొందరు సీనియర్లు కూడా అల్లుడు గారి వ్యవహార శైలిపై రుసరుసలాడుతున్నారు. కొందరైతే పార్టీలో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు.

ఇలాంటి పరిస్థితి ఊహించలేదు

అధికారం చేతిలో ఉంది కదా అని పార్టీలో ఎవరి పరిస్థితేమిటి.. ఎవరెంత పని చేశారనేది తెలుసుకోకుండా సీనియర్లను పక్కన పెట్టడాన్ని టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్లకు పొమ్మనకుండానే పొగ పెట్టేశారు. ఇలా ఇంకెంత మందిని దూరం పెడతారో తామూ చూస్తామని ఆవిర్భావం నుంచీ పార్టీ వెన్నంటి నిలిచిన నాయకులు సవాల్‌ చేస్తున్నారు. అసలు పార్టీ సభ్యత్వం కూడా లేని అల్లుడి పెత్తనం తుని టీడీపీలో దుమారం రేపుతోంది. తమను ఆయన ఏ కోశానా నమ్మడం లేదని, పైగా ఆయన అనుచరులు సైతం పేట్రేగిపోతున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్లు ఒకరొకరుగా పార్టీకి దూరమయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పార్టీలో నంబర్‌–2గా ఉన్న నేతతో కలిసి తిరిగిన తమకు ఇటువంటి పరిస్థితి ఎదురవుతోందని కలలో కూడా ఊహించలేదని ద్వితీయ శ్రేణి నేతలు కారాలూ మిరియాలూ నూరుతున్నారు. ఇప్పుడంటే పార్టీలో పెద్దన్న పాత్ర లేకుండా పోయిందే తప్ప.. ఆ స్థాయిలో ఉన్నప్పుడు కూడా తమను ఎప్పుడూ కరివేపాకుల్లా చూడలేదని అంటున్నారు. ఇదంత తెలిసి కూడా కీలక నేత పట్టించుకోకపోవడంలో ఔచిత్యమేమిటో అర్థం కావడం లేదని తెలుగు తమ్ముళ్లు రచ్చబండల వద్ద గుసగుసలాడుకుంటున్నారు. పార్టీలో ఇన్నేళ్ల సీనియారిటీ ఉండి సబ్‌ జూనియర్‌ అయిన వారి ముందు చేతులు కట్టుకుని పని చేయడం తమ వల్ల కాదని అంటున్నారు. కేవలం పెద్దాయన ముఖం చూసే ఇంకా కొనసాగుతున్నాం తప్ప లేదంటే ఎప్పుడో తుది నిర్ణయం తీసుకునే వారమని చెబుతున్నారు. ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement