
రైతులకు తక్షణం ఎరువులు ఇవ్వాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా
● కలెక్టర్‌కు పార్టీ నేతల వినతి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఖరీఫ్ సాగు పనులు ప్రారంభమై నెల రోజులు పైగా గడచినా రైతులకు అవసరమైన స్థాయిలో ఎరువులు సరఫరా చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. ఇప్పటికీ రైతులు ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురు కావడం దారుణమన్నారు. ఎరువులు, యూరియా కొరత నివారణకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎరువులు, యూరియా కొరతపై రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన విజ్ఞాపన పత్రాలు అందించాలని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన వైఎస్సార్ సీపీ నేతలు కలెక్టర్ షణ్మోహన్ సగిలికి సోమవారం విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం రాజా మీడియాతో మాట్లాడుతూ, రైతు సమస్యల పరిష్కారానికి కూటమి సర్కార్ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇక్కడి రైతుల సమస్యలపై స్పందించాలన్నారు. రైతులను ఆదుకోవడానికి సమీక్ష నిర్వహించాలన్నారు. ఇరిగేషన్‌పై పిఠాపురానికి ప్రత్యేకంగా ఇచ్చిన మ్యానిఫెస్టోను పవన్ ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం యూరియా బస్తాను రూ.270కే రైతుభరోసా కేంద్రాల వద్ద అందించిందన్నారు. అటువంటిది నేడు మార్కెట్‌లో యూరియా బస్తాను రూ.350 నుంచి రూ.400కు అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మార్చి నెలలోనే యూరియా, ఇతర ఎరువులు నిల్వ చేసేదని గుర్తు చేశారు. రైతు కష్టాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరి, మామిడి, అరటి, చెరకు ఇలా ఏ రైతులైనా ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు ఎందుకు అందుబాటులో ఉంచడం లేదని రాజా ప్రశ్నించారు.
‘సుఖీభవ’ ఏమూలకు?
అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇవ్వనున్నట్లు కూటమి నేతలు చెప్పారని, దీని ప్రకారం రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాలని దాడిశెట్టి రాజా అన్నారు. తీరా చూస్తే కేంద్ర ప్రభుత్వంతో కలిసి రైతులకు రూ.5 వేలు, రూ.2 వేలు అంటూ వేసిన రూ.7 వేలు రైతులకు ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. మరణించిన కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఐదు కోట్లు పంచిపెడతామంటూ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి గతంలో కంటే రెట్టింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పురుగుల మందు కొంటేనే యూరియా అమ్ముతామంటున్న పరిస్థితిపై పవన్ సమీక్షించాలని రాజా అన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు వంగా గీత, తోట నరసింహం, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, దవులూరి దొరబాబు, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు లంక ప్రసాద్, పార్టీ అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాంజీ, జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల లోవరాజు, రావూరి వెంకటేశ్వరరావు, రోకళ్ల సత్య, జేడీ పవన్, గొల్లపల్లి నానాజీ, ఒమ్మి రఘురామ్, యనమల కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు తక్షణం ఎరువులు ఇవ్వాలి