
మాకొద్దీ ‘హెల్’ ఫోన్లు
● అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన
● సెల్ ఫోన్లు కార్యాలయంలో అప్పగింత
కాకినాడ క్రైం: పని చేయని ఫోన్లు ఇచ్చి.. పని భారం పెంచేస్తున్న ప్రభుత్వ తీరుపై జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు కన్నెర్ర చేశారు. కాలం చెల్లిన ఫోన్లతో విధి నిర్వహణ నరకంలా మారిందని నిరసన తెలుపుతూ.. ఆ మొబైల్ ఫోన్లను ఆయా ఐసీడీఎస్ కార్యాలయాల్లో అప్పగించేశారు. తక్కువ డేటాతో ఎక్కువ పని చేయాలని సతాయించడం.. పోషణ ట్రాకర్, బాల సంజీవని అనే రెండు యాప్‌లను మిళితం చేసి ఒకే యాప్‌గా ఇవ్వాలని కోరినా పట్టించుకోకపోవడం.. పని భారం నానాటికీ పెంచేయడం.. దీనికి తగినట్టుగా జీతం పెంచకపోవడం.. ఉద్యోగ భద్రత కరవవడం.. ఉన్నతాధికారుల నియతృత్వ ధోరణిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కోరుతూ నేపథ్యంలో కాలం చెల్లిన, పాడైన ఫోన్లను కార్యాలయాల్లో అప్పగించారు. విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామం నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఐసీడీఎస్ పీడీ లక్ష్మి తెలిపారు.