
ఆర్డినెన్స్‌తో ‘జయలక్ష్మి’ బాధితులకు న్యాయం చేయాలి
కాకినాడ రూరల్: జయలక్ష్మి ఎంఏఎం కో ఆపరేటివ్ సొసైటీ బాధితులకు సత్వర న్యాయం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డినెన్స్‌ను తీసుకు రావాలని చైర్మన్ గంగిరెడ్డి త్రినాఽథరావు అన్నారు. సర్పవరం జంక్షన్ వద్ద మెయిన్ బ్రాంచ్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పాలకవర్గం అధికారం చేపట్టి దాదాపు మూడేళ్లు అయ్యిందని, బాధితుల కోసం పోరాటం సాగిస్తూనే, రుణాలు తీసుకుని ఎగ్గొటిన వారికి చెందిన సుమారు రూ.500 కోట్ల ఆస్తులను సీజ్ చేయించామన్నారు. రూ.300 కోట్ల వరకూ ట్రిబ్యునల్‌లో కేసులు వేశామని, అవి జడ్జిమెంట్‌కు సిద్ధంగా ఉన్నాయన్నారు. వాటిలో 13 కేసుల్లో రూ.70 కోట్ల వరకూ డిక్రీ అయ్యిందని, ఆ ఆస్తులను వేలం వేసి అమ్మేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈలోగా బాధితుల సంఘమని చెప్పుకుంటూ ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయని కమిషనర్‌కు ఫిర్యాదు చేశారని, దానిపై కమిషనర్ విచారణకు ఆదేశించారన్నారు. కలెక్టర్ ద్వారా డీసీఓ విచారణ నిమిత్తం అసిస్టెంట్ కో ఆపరేటివ్ రిజిస్ట్రార్ జీవీ లక్ష్మిని నియమించడంతో ఆమె విచారణ చేసి, రికార్డులను తనిఖీ చేసి, అవకతవకలు లేవని మే నెలలో తేల్చారన్నారు. తమ పాలకవర్గం రాకముందు అడ్‌హాక్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన వీఎస్‌వీ సుబ్బారావు రికార్డులను అప్పగించలేదన్నారు. ఆయనపై ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. జయలక్ష్మి సొసైటీ బాధితులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం రూ.300 కోట్లు అప్పుగా ఇవ్వాలని తాము కోరామన్నారు. సొసైటీకి దాదాపు రూ.700 కోట్ల ఆస్తులు ఉన్నాయని, బాధితులకు రూ.580 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. సమావేశంలో డైరెక్టర్లు చింతా సుబ్బారావు, షేక్ జానీ బాషా, గౌరీ శేఖర్, బాధితులు పాల్గొన్నారు.