
పెళ్లి భయంతో పారిపోయిన బాలికలు
కాకినాడ రూరల్: ఇంటిలోని పెద్దలు పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో ఆ బాలికలు భయపడిపోయారు. తమకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేస్తారనే ఆందోళనతో ఇంటి నుంచి పారిపోయారు. వారి తల్లుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే స్పందించి ఆ బాలికల ఆచూకీ గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. కరప మండలం అచ్యుతాపురానికి చెందిన ఇద్దరు బాలికలు వరసకు అక్కాచెల్లెళ్లు (అన్నదమ్ముల పిల్లలు) అవుతారు. వీరిలో ఒకరు ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, మరొకరు పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరికీ పెద్దలు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. తమకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేస్తారనే భయం వారికి పట్టుకుంది. పెద్దలను ఎదిరించలేక, ఇంటి నుంచి పారిపోయేందుకు పథకం వేసుకున్నారు. సోమవారం ఉదయం ఇంటి నుంచి కాలేజ్, స్కూల్‌కు అని చెప్పి బయలుదేరారు, మధ్యాహ్నం మూడు గంటలకు కాకినాడ నుంచి తప్పించుకుని పారిపోయారు. రాత్రయినా ఇద్దరు పిల్లలూ ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల అన్నిచోట్లా వెతికారు. ఫలితం లేకపోవడంతో రాత్రి పది గంటలకు ఇంద్రపాలెం పోలీసులను ఆశ్రయించారు. బాలికల తల్లుల ఫిర్యాదు మేరకు ఎస్సై వీరబాబు కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు సమాచారంతో పాటు తన బృందంతో ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. బాలికలు అమలాపురం వైపు వెళ్లినట్టు టెక్నాలజీ ఆధారంగా గుర్తించి, అక్కడి పోలీసుల సహకారంతో కేవలం మూడు గంటల వ్యవధిలోనే పట్టుకోగలిగారు. బాలికలను మంగళవారం ఉదయం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్సీ బిందు మాధవ్, ఏఎస్సీ పాటిల్ దేవరాజ్, రూరల్ సీఐ చైతన్య కృష్ణ, సిబ్బంది, అమలాపురం పోలీసుల సహకారంతో తక్కువ సమయంలో బాలికల ఆచూకీ కనుగొన్నామని ఎస్సై వీరబాబు తెలిపారు.
తల్లుల ఫిర్యాదుపై స్పందించిన
ఇంద్రపాలెం పోలీసులు
గంటల వ్యవధిలోనే ఆచూకీ లభ్యం