● స్పృహ కోల్పోయిన బాలిక ● చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్
సామర్లకోట: పిల్లలు, విద్యార్థులు పొరపాటు చేస్తే వారికి నచ్చ చెప్పాల్సిన ఉపాధ్యాయులు అతి కిరాతకంగా వ్యవహరించిన వైనం ఇది. సామర్లకోట జెడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న బి.మహేశ్వరి చెవిదిద్దు ఊడిపోయి హిందీ ఉపాధ్యాయిని భారతీ లక్ష్మి కాలికి తగిలింది. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయిని.. మహేశ్వరిని సుమారు గంటపాటు ఎండలో మోకాళ్లు వేయించింది. దీంతో బీపీ తగ్గిపోయి, మోకాళ్లు కొట్టుకుపోయి ఆ విద్యార్థిని స్పృహ కోల్పోయింది. సహచర విద్యార్థులు, స్థానికులు ఈ విషయాన్ని చర్చించుకోవడంతో సమీపంలో ఉన్న మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ ఆమెను సీహెచ్‌సీకి తరలించారు. ఇంతలో సమాచారం అందుకున్న చిన్నారి తల్లిదండ్రులు, వారి బంధువైన కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ అక్కడకు చేరుకుని విద్యార్థినిపై క్రూరంగా వ్యవహరించిన హిందీ టీచర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఉపాధ్యాయుల వల్లే ప్రభుత్వ పాఠశాలలకు చెడ్డ పేరు వస్తోందని అప్పలకొండ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయినిపై చర్య తీసుకోకుంటే జిల్లా విద్యాశాఖాధికారి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీనిపై ఎంఈఓ వై.శివరామకృష్ణయ్యను వివరణ కోరగా విద్యార్థినిని మోకాళ్లు వేయించడంతో ఇంటికి వెళ్లిన తరువాత స్పృహ కోల్పోయిందని, దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లారని చెప్పారు. విద్యార్థులను మోకాళ్లు వేయడం సరికాదని, చిన్నారుల పట్ల సున్నితంగా వ్యహరించాలని పదేపదే ఉపాధ్యాయులకు చెప్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన వివరించారు.


