అలంపూర్: రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు నమోదుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్సీతోపాటు ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రతి పట్టభద్రుడు ఓటును నమోదు చేసుకోవాలన్నారు. ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి ఈ నెల 6 వరకు అవకాశం ఉందన్నారు. పట్టభద్రులుగా ఓటుహక్కు నమోదు చేసుకుంటే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం ఉంటుందన్నారు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఒక్కటీ గెలవలేదన్నారు. తెలంగాణలోనూ ఆ పార్టీని ఆదరించే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందంటే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే మా పనులు కావడం లేదని నిరాహారదీక్ష చేస్తామనే దయనీయ పరిస్థితికి చేరిందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కాకుండా.. ప్రజలే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా కేసీఆర్‌ను ఎప్పుడు సీఎం చేద్దామా అని నిరీక్షిస్తున్నారన్నారు. వర్షాలు లేక పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టుభద్రులు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు జయరాముడు, సురేష్, వైస్‌చైర్మన్లు విక్రమ్, నర్సింహులు, వెంకట్రాములు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


