గద్వాల: జిల్లాలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడిన రైస్‌మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రైస్‌మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని కొల్లగొడుతూ అప్పనంగా రూ.కోట్లు కొట్టేస్తున్న వైనంపై ‘సాక్షి’లో ప్రచురితమవుతున్న వరుస కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇది వరకే రూ.60 కోట్ల మేర ప్రభుత్వ ధాన్యాన్ని మింగిన రైస్‌మిల్లర్లు తాజాగా 2025– 26 ఖరీఫ్‌కు సంబంధించి కూడా పెద్దఎత్తున కొల్లగొట్టారు. ఈ అక్రమ దందాలో మిల్లర్లతోపాటు సివిల్ సప్లయ్ అధికారులు సైతం భాగస్వాములుగా ఉన్నారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే రూ.8 కోట్ల విలువ గల ప్రభుత్వ ధాన్యాన్ని మింగిన రైస్‌మిల్లర్‌పై కేసు నమోదు కావడంతో అక్రమాలకు పాల్పడిన మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యంలో 90 వేల బస్తాల (40 కిలోలు) ధాన్యంను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించి సొమ్ముచేసుకున్న వ్యవహారంపై గత నెల 30న దువాసిపల్లి మిల్లుపై చర్యలేవి శీర్షికన కథనం ప్రచురితమైంది. తాజాగా దీనిపై స్పందించిన అధికారులు సోమవారం దువాసిపల్లికి చెందిన శ్రీలక్ష్మీవెంకటేశ్వర మోడ్రన్ రైస్‌మిల్లుపై సివిల్ సప్లయ్ డీఎం విమల కోదండాపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. అలాగే దొడ్డుబియ్యం పెట్టిన వ్యవహారంలోనూ అధికారులు రహస్యంగా విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే ఈ దొడ్డు బియ్యం వ్యవహారంలో సివిల్ సప్లయ్ అధికారిపై కూడా రహస్య విచారణ చేపట్టినట్లు సమాచారం. విచారణకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


