మానవపాడు: రెగ్యులరైజేషన్ కోసం వీబీజీ రామ్జీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా.. 13 మండలాల్లో 126 మంది ఫీల్డ్అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తుండగా.. 1,39,490 జాబ్కార్డులు ఉన్నాయి. 80 వేల మంది కూలీలుగా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం 5,700 మంది కూలీలు క్రమం తప్పకుండా పనిచేస్తున్నారు. వీబీజీ రాంజీ పథకం క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాలు మాత్రం నేటికీ అంధకారంలోనే ఉన్నాయి. 20 ఏళ్లుగా నిత్యం విధులు నిర్వహిస్తున్నా.. నేటికీ కాంట్రాక్ట్ ప్రాతిపదికగానే మిగిలిపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2006 ఫిబ్రవరి 2న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రాంరంభించినప్పుడు గ్రామస్థాయిలో పనుల పర్యవేక్షణ, కూలీల హాజరు, మస్టర్ రోల్ నిర్వహణ, కొలతలు వంటి బాధ్యతల కోసం ఫీల్డ్ అసిస్టెంట్లను నియామకం చేసుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా వీరి తలరాత మారలేదు.
భద్రత కరువు
అనారోగ్యం సమస్య వస్తే సెలవు తీసుకుంటే జీతంలో కోత ఉంటుందని, ఫీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సౌకార్యలు లేవని ఎఫ్ఏలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లుగా సేవలో ఉన్నవారిలో చాలా మంది వయసు 45 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు దీన్ని మానేసి మరో ఉగ్యోగం చేసే అవకాశం లేదు. అనుభవం మొత్తం ఈ ఉద్యోగానికి దారపోశారు. అయినా తగిన ప్రతిఫలం దక్కడం లేదంటున్నారు.
హమీలే తప్పా.. అమలు లేదు
ప్రతి ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఫీల్డ్ అసిస్టెంట్లను రెగ్యులరైజ్ చేస్తామని హామీలు ఇస్తున్నా.. ఎన్నికలు అయిపోగానే ఆ హామీలు నీటి బుడగల్లా మారుతున్నాయి. గత ప్రభుత్వం కూడా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పి చేతులు దులిపేసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం కుడా ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగ భద్రత గాలిలో దీపంలా మారింది.
రూ.11 వేల వేతనంతో..
గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉదయం 6 గంటలకే పని ప్రదేశానికి చేరుకోవాలి. కూలీలను పనులకు రప్పించే బాధ్యత వీరిదే. రోజులో రెండుసార్లు కూలీల హాజరు, కొలతలు, ఎంబీ బుక్ ఆన్లైన్ నమోదు వంటి పనులతో రోజుకు 10 గంటలకు పైగా పని చేస్తున్నారు. అయినా వారికి అందుతున్న జీతం కేవలం రూ.11 వేలు మాత్రమే. ఇందులోనే బైక్ పెట్రోల్, మొబైల్ రీచార్జ్, ఇతర ఖర్చులు కూడా భరించాలి. నెలకు చేతికి మిగిలేది రూ.7 వేలు నుంచి 8 వేల మధ్యే ఉంటుందని, దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారుతోందని ఫీల్డ్ అసిస్టెంట్లు వాపోతున్నారు. పెరిగిన స్కూల్ ఫీజులు, నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులతో దినదిన గండంగా మారిందంటున్నారు.
అరకొర జీతంతోనెట్టుకొస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు
గ్రామాల్లో ఉపాధికి వెన్నెముకగా విధులు
20 ఏళ్లుగా సేవ.. రూ.11 వేలే జీతం
కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే
గుర్తిస్తున్న ప్రభుత్వం
రెగ్యులరైజ్ చేసి.. ఉద్యోగ భద్రత కల్పించాలి


