గద్వాల: పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను కేంద్ర ఎన్నిక ల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టా లని సూచించారు. పట్టభద్రుల ధ్రువీకరణ పత్రాల ను క్షుణ్ణంగా పరిశీలించి, నకిలీ పత్రాల నమోదుకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పొదుపుతో ఆర్థిక భరోసా
ప్రతి కుటుంబం పొదుపును అలవాటుగా మార్చుకోవాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ సూచించారు. శనివారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల కరపత్రాన్ని విడుదల చేశారు. 1000 రోజుల డిపాజిట్‌పై సాధారణ ఖాతాదారులకు 7.50శాతం, సీనియర్ సిటీజన్లకు 8 శాతం వడ్డీ లభిస్తుందని తెలిపారు. 444 రోజుల డిపాజిట్‌పై వరుసగా 7.40 శాతం, 7.90 శాతం వడ్డీ అందుబాటులో ఉందన్నారు. వివరాలకు 92475 43618 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఆధార్‌లో రాష్ట్రం పేరు మార్పునకు
60 రోజుల గడువు
ఆధార్ కార్డుల చిరునామాలో రాష్ట్రం పేరును ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చుకునేందుకు 60 రోజుల పాటు అవకాశం కల్పించినట్లు కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ తెలిపారు. తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ, యూఐడీఏఐ సమన్వయంతో ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల ప్రభావిత నివాసితులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పబ్లిక్ నోటీసు జారీ చేసిన తేదీ నుంచి 60 రోజులపాటు స్వచ్ఛందంగా చిరునామాలో రాష్ట్రం పేరును సవరించుకోవచ్చని వెల్లడించారు.


