గద్వాల క్రైం: ప్రకృతిలో పూసిన పూలతో మహిళలు జరుపుకొనే బతుకమ్మ పండుగ సంబరాలను ఎస్పీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఆవరణంలోని బతుకమ్మ పాటలు, కోలాటాల దరువులతో ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీలు మొగిలయ్య, నరేందర్రావు, మహిళా సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు. మహిళలు బతుకమ్మను ఎత్తుకుని అలరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ, ఆటపాటలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఆడపడుచులంతా సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం పట్ల మహిళా సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.


