ఎర్రవల్లి: ఇటిక్యాల మండలంలోని శివనంపల్లి గ్రామంలో 2023– 24లో గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ గ్రామస్తులు గతంలో లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ మేరకు ఫిర్యాదుపై స్పందించిన లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ జైపాల్ శనివారం గ్రామాన్ని సందర్శించి నిధుల దుర్వినియోగంపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, నిధుల ఖర్చు, సంబంధిత రికార్డులను ఆయన పరిశీలించి ఫిర్యాదులో పేర్కొన్న పలు అంశాలపై వివరాలు సేకరించి, వాస్తవ పరిస్థితుల గురించి ఆరాతీశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణాలు జరిగాయని, దీంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రజాధనాన్ని పారదర్శకంగా వినియోగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, నిధుల వినియోగంపై అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు నిధుల వినియోగంపై 7 రోజుల గడువులోపు పూర్తి నివేదికను తమకు అందించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఓ శ్రీకాంత్, డీఎల్పీఓ ప్రవీణ్కుమార్ రెడ్డి, ఎంపీఓ సునీల్ తదితరులు పాల్గొన్నారు.


